తెలంగాణ ప్రభుత్వం 111 జీవో ప్రాంతంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 111 జీవోను ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయినా ఇప్పటి వరకు 111 జీవో విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో 111 జీవోపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఇప్పటివరకు సందిగ్ధం నెలకొంది. ఈ క్రమంలో 111 జీవో పై ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి.. అందుకు సంబంధించిన కసరత్తు మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించినట్లు సచివాలయ వర్గాల సమాచారం.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో 111 జీవో పై ఉత్కంఠ కొనుసాగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండేళ్ల క్రితం 2023 మేలో 111 జీవో పరిధిలోని ప్రాంతాల్లో ఉన్న ఆంక్షలను ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో అథారిటీ ఏరియా నిబంధనల మేరకు ఇకపై 111 జీవో పరిధిలోని ప్రాంతాల్లోను నిర్మాణాలు చేసుకోవచ్చని అప్పట్లో కేసీఆర్ సర్కార్ ప్రకటించింది. 111 జీవో పరిధిలోని 84 గ్రామాల్లోని 1.32 లక్షల ఎకరాలకు పైగా భూమి అందుబాటులో ఉంది. అయితే నిర్మాణాలకు సంబంధించిన విధి విధానాలను మాత్రం ఖరారు చేయకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయింది. ఆ తరువాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ 111 జీవో ప్రాంతంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో111 జీవో ఉపసంహరణపై రేవంత్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న సస్పెన్స్ కొనసాగుతూ వస్తోంది.
అయితే ఆరు గ్యారంటీలు, ఇతర సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. నిధుల సమీకరణలో భాగంగానే కంచ గచ్చిబౌలి భూములను అమ్మాలని భావించిన రేవంత్ సర్కార్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే ప్రత్యమ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 111 జీవో ప్రాంతంలో ఉన్న 1.32 లక్షల ఎకరాల్లో సుమారు 30 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ ప్రాంతానికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటూ 111 జీవోను ఎత్తేసింది గనుక అక్కడ నిర్మాణాలకు సంబంధించి విధివిధానాలను రూపొందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
111 జీవో ప్రాంతానికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, గైడ్ లైన్స్ మేరకు అభివృద్ది చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ భవన నిర్మాణ నిబంధనలు, జలాశయాల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, జోన్ల ఏర్పాటు, మాస్టర్ ప్లాన్ వంటి వాటిపై సమగ్ర నివేదిక రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం అధికారులతో ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించనున్నట్లు సమాచారం. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను రక్షించుకుంటూనే పర్యావరణానికి హాని జరక్కుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కమిటీ అధ్యయనం చేయనుందని అంటున్నారు.111 జీవో ప్రాంతంలో ఆంక్షలను ఎత్తేసి ప్రభుత్వ భూములను అభివృద్ధికి ఉపయోగించుకోవడంతో పాటు కొంత మేర భూములను అమ్ముకోవచ్చని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
111 జీవో పరిధిలో ఇప్పుడున్న ఆంక్షలను ఎత్తేస్తే పర్యావరణానికి హాని తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ విస్థీర్ణం 217 చదరపు కిలో మీటర్ల మేర విస్తరించి ఉండగా, అందుకు రెండున్నర రెట్లు అధికంగా 538 చదరపు కిలో మీటర్ల మేర 111 జీవో పరిధి విస్తరించి ఉంది. భవిష్యత్తు తరాల కోసం జంట జలాశయాలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా 111 జీవో మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని నిపుణులు చెబుతున్నారు. పర్యావరణానికి హాని కలిగించని నిర్మాణాలకు మాత్రం ఇక్కడ చోటు కల్పించాల్సిన అవసరం ఉంది. 111 జీవో పరిధిలోని మాస్టర్ ప్లాన్ లో నెట్ జీరో సీవరేజ్ పాలసీని అవలంభించాలని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. అంటే ప్రతి ఇంటికి తప్పనిసరిగా సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ఉండాలి. దీని ద్వారా మురుగు నీరు బయటికి వెళ్లకుండా ఉండటం వల్ల జంట జలాశయాలు కలుషితం కావు. 111 జీవో పరిధిలో స్టీల్, సిమెంట్ వంటి భవన సామగ్రి స్థానంలో కలప వంటి ప్రత్యమ్నాయాలను ఉపయోగించాలని సూచిస్తున్నారు.
హైదరాబాద్ అభివృద్ధికి 111 జీవో కాంప్లిమెంటరీగా ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఆకాశహర్మ్యాలకు, ఐటీ భవనాలకు అనుమతి ఇచ్చి ఇప్పుడున్న ప్రాంతాలకు కాంపిటీషన్ గా కాకుండా, నగరానికి కొత్త ప్రాంతం కాంప్లిమెంటరీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 111 జీఓ పరిధిలోని గ్రామాలలో చాలా వరకు భూములు కొనుగోలు చేసి ఫామ్ హౌస్ లను నిర్మించడం వల్ల హైదరాబాద్ స్థిరాస్తి వ్యాపారంపై పరిమిత స్థాయిలో ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. అలా కాదని 111 జీవో పరిధిలో హైరైజ్ భవనాలకు అనుమతి ఇస్తే.. హైదరాబాద్ ఉష్ణోగ్రతపై ప్రతికూల ప్రభావం చూపించడంతో పాటూ కాలుష్యం పెరుగుతుంది. జంట జలాశయాలు మరో హుస్సేన్ సాగర్ లాగా మారే ప్రమాదం ఉంది. స్వయం సమృద్ధితో కూడిన సౌకర్యాలతో పారిశుధ్యం, రోడ్లను అభివృద్ది చేయాలి. జంట జలాశయాల నుంచి కొన్ని కిలో మీటర్ల మేర బఫర్ జోన్ ను ఏర్పాటు చేసి ఇక్కడ రిసార్ట్ లకు మాత్రమే అనుమతి ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
111 జీవో పరిధిలో స్పోర్ట్స్ జోన్ ను ఏర్పాటు చేసి ఇక్కడ ఆట స్థలాలు, క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. తక్కువ సాంద్రత కలిగిన గృహ నిర్మాణాలు, వినోద కేంద్రాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలి. అలా జరిగితే జంట జలాశయాల ఉనికికి హాని జరక్కుండా, 84 గ్రామాల్లో పర్యావరణ సహిత నగరాన్ని నిర్మించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.