హైదరాబాద్ అనగానే ఠక్కున గుర్తుకొచ్చేవి చార్మినార్.. హుస్సేన్ సాగర్ లో బుద్దుడి విగ్రహం.. ఇంకా గోల్కొండ, బిర్లా టెంపుల్.. ఇప్పుడు వీటి సరసన మరో అద్భుత నిర్మాణం చేరనున్నది. అదే కొత్త సచివాలయం. రూ.616 కోట్లతో నిర్మించిన ఈ సెక్రటేరియట్ భవనం హైదరాబాద్ నగరానికి మరో కలికితురాయి. హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మించిన ఈ భవనానికి పొన్నీ కాన్సెసావో, ఆస్కార్ కాన్సెసావోలు ఆర్కిటెక్టులు. ఇండో-సార్సెనిక్ శైలిలో కనిపించే ఈ నిర్మాణం ఇండో-ఇస్లామిక్ లక్షణాలను సాధారణ డోమ్ లతో మిళితం చేసింది.
భారతదేశ నిర్మాణ చరిత్రను చూస్తే.. ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ముఖ్య లక్షణమైన డోమ్ అనేది 12వ శతాబ్డంలో టర్కీ దండయాత్రల సమయంలో భారత్ కు వచ్చింది. 16వ శతాబ్దంలో ఢిల్లీలో అఖర్ నిర్మించిన హుమాయూన్ సమాధితో డబుల్ డోమ్ కలిగి ఉండే ఆచారం మొదలైంది. 17వ శతాబ్దంలో షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్ లో బహుళ గోపురాలు నిర్మించారు. తాజాగా హైదరాబాద్ లో మొఘల్ ఆర్కిటెక్చర్, ఇస్లామిక్ నిర్మాణ సంప్రదాయాలు, హిందూ శైలుల కలయికతో కొత్త సెక్రటేరియట్ రూపుదిద్దుకుంది. బహుళ గోపురాలు, తోరణాలు సింక్రెటిక్, లిబరల్ డెక్కన్ శైలిని సూచిస్తున్నాయి. ఈ భవనం డిజైన్ ను సీఎం కేసీఆర్ అత్యంత శ్రద్ధతో పర్యవేక్షించారు. ఆర్కిటెక్టులు తీసుకొచ్చిన డిజైన్లకు పలు మార్పులు సూచించి తుది డిజైన్ ఖరారు చేశారు.
సచివాలయం ప్రధాన భవనంతోపాటు సందర్శకులు, పోలీసు సిబ్బంది, అగ్నిమాపక శాఖ, క్రెచ్ కోసం అనుబంధ భవనాలు, యుటిలిటీ భవనం, దేవాలయం, మసీదు, చర్చి కూడా నిర్మిస్తున్నారు. ల్యాండ్ స్కేపింగ్, స్టోన్ పేవ్ మెంట్ లతో కూడిన హార్డ్ స్కేప్, లాన్లు, చెట్లు, ఫౌంటెయిన్లు, వీవీఐపీలు, సిబ్బంది, ఇతరుల కోసం పార్కింగ్ సదుపాయాలు ఉన్నాయి.
ప్రధాన గోపురంపై అశోకుడి నాలుగు సింహాల బొమ్మ ఏర్పాటు చేశారు. బీఆర్ అంబేడ్కర్ సచివాలయ భవనం అత్యంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, రాజకీయ వివాదాలు కూడా రేగుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే డోమ్ లు కూలగొడతామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. ఎంఐఎంను ప్రసన్నం చేసుకునేందుకే అలా డోమ్ లు ఏర్పాటు చేశారని ఆరోపించారు. కాగా, ముందు నిర్ణయించిన ప్రకారం ఈనెల 17న సచివాలయం ప్రారంభోత్సవం జరగాలి. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా వాయిదా పడింది.