రూప్ టాప్ ద్వారా సౌర విద్యుత్పత్తికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఇటీవల రాష్ట్ర శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన సమాధానమిస్తూ.. పునరుత్పాదక ఇంధన వనరులు సౌర, పవన, వ్యర్థాలనుంచి విద్యుత్ ఉత్పత్తి పెంచడంతో పాటు వినియోగించుకోవడానికి తెలంగాణా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంపొందించే ప్రక్రియలో భాగంగా సోలార్ టెండర్లు, ఆన్ లైన్ లో దరకాస్తుల స్వీకరణ, సౌర రూప్ టాప్ ట్రాకింగ్, నెట్ మీటరింగ్ వంటి వినియోగ సౌలభ్యం మొదలైన సదుపాయాలతో పునరుత్పాదక ఇంధన సామర్ధ్య జోడింపులతో రాష్ట్రాన్ని అగ్రగామిగా మార్చడానికి దోహదపడ్డాయని ఆయన చెప్పారు. జనవరి, 2023 చివరి నాటికి పునరూత్పాదక ఇంధన సామర్ధ్యం 6,159 మేఘావాట్లు నమోదు అయ్యిందన్నారు.
రూప్ టాప్ సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహాకం
ఆన్ లైన్ ట్రాకింగ్, సాధన పర్యవేక్షణ లతో ప్రారంభించబడి పారదర్శకతతో పాటు వినియోగదారుల స్నేహపూర్వక సాధన ప్రక్రియలతో రూప్ టాప్ పై సోలార్ జోడింపును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహిస్తుందన్నారు. ఇది 287 మేఘావాట్ల సౌర రూప్ టాప్ సామర్థ్యాన్ని సాధించడానికి టీఎస్ డిస్కమ్ లకు సహాయ పడిందని ఆయన పేర్కొన్నారు. 2023 జనవరి చివరి నాటికి 5748 మేఘావాట్ల సౌర విద్యుత్,128.10 మేఘావాట్ల పవన విద్యుత్ ను ఉత్పత్తి చేసినట్లు ఆయన సభకు వివరించారు. రాబోయే రెండు సంవత్సరాలలో 2,500 మేఘవాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.