తెలంగాణలో ఎన్నికలయ్యాక రాజకీయాలు చేయట్లేదని.. తమ ఫోకస్ అంతా రాష్ట్రాభివృద్ధి మీదే కేంద్రీకరించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ లో సీఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో విద్యా, నైపుణ్యాభివృద్ధి అంశంపై జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 2000 కోట్లతో 64 ఐటీఐ లను స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లుగా డెవలప్ చేయనున్నట్లు చెప్పారు. స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ లో జాయిన్ అయిన విద్యార్థులకు డిగ్రీ సర్టిపికెట్స్ ఇవ్వబోతున్నామనీ అన్నారు. ఈ ప్రభుత్వం అందరిదీ.. మీరు కోరుకుంటేనే ఇక్కడికొచ్చామని.. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి అందరి సహకారం అవసరమన్నారు. ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ విధానమన్నారు.
పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారని చెప్పారు. అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవన్నారు. నగర అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని చెప్పారు. గతంలో అవుటర్ రింగ్ రోడ్ అవసరం లేదని కొందరు అన్నారని.. ఇప్పుడది హైదరాబాద్ కు లైఫ్ లైన్ గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
This website uses cookies.