Categories: LATEST UPDATES

ఆఫీస్ స్పేస్ కు అదిరే డిమాండ్

8 నగరాల్లో 80 మిలియన్ చ.అ. దాటే చాన్స్

కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ నివేదిక వెల్లడి

దేశంలో కార్యాలయ రంగం కదం తొక్కుతోంది. ఈ ఏడాది దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ డిమాండ్ 80 మిలియన్ చదరపు అడుగులు దాటే అవకాశం ఉందని కుష్ మన్ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ నివేదిక తెలిపింది. 2023లో ఇది 74 మిలియన్ చదరపు అడుగులు ఉండగా.. ఈ ఏడాది మరో 6 మిలియన్ చదరపు అడుగులు అదనంగా ఉండనుంది. 2024 మొదటి ఆరు నెలల్లో 41.9 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ నమోదు కాగా, ద్వితీయ ఆరు నెలల్లోనూ ఇదే ధోరణి ఉంటుందని, మరో 40 మిలియన్‌ చదరపు అడుగుల మేర ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ నమోదు కావచ్చని అంచనా వేసింది. అలాగే విశ్వసనీయత కలిగిన డెవలపర్ల నుంచి గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ కోసం పలు అంతర్జాతీయ కంపెనీలు చూస్తున్నట్టు పేర్కొంది.

వాస్తవానికి గ్రేడ్‌ ఏ ఆఫీస్‌ వసతుల లీజింగ్‌ ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 0.40 శాతం తగ్గి 17.7 శాతంగా ఉంది. 2021 చివరి మూడు నెలల కాలం తర్వాత ఇంత తక్కువ లీజింగ్‌ తిరిగి మళ్లీ ఇదే కావడం గమనార్హం. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఐటీ-బీపీఎం రంగం అత్యధికంగా 26 శాతం మేర స్థూల ఆఫీస్‌ వసతుల డిమాండ్‌ను ఆక్రమించింది. ఆ తర్వాత బీఎఫ్‌ఎస్‌ఐ రంగం రెండో స్థానంలో ఉంది. భారత్‌ అంతర్జాతీయంగా పోటీతత్వంతో కూడిన సానుకూల ప్రయోజనాలను ఆఫర్‌ చేస్తుండటంతోపాటు దేశంలో యువ, సాంకేతిక నిపుణులు అధిక సంఖ్యలో ఉన్నారని, ఈ అనుకూలతలు అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

బలమైన ఆర్థిక మూలాలు, అత్యాధునిక డిజిటల్‌ సాంకేతికత, కార్యాలయాలకు వచ్చి పనిచేసే ఉద్యోగులు పెరగడం, కరోనా కాలంలో వాయిదా పడిన విస్తరణ ప్రణాళికలు అమల్లోకి రావడం వంటి అంశాలన్నీ డిమాండ్ పెంచుతున్నట్టు పేర్కొంటున్నారు. దేశీయ కంపెనీల నుంచి డిమాండ్‌ స్థిరంగా ఉండగా, అంతర్జాతీయ కంపెనీలను సైతం భారత ఆర్థిక వ్యవస్థ ఆకర్షిస్తున్నట్టు వెల్లడిస్తున్నారు. అలాగే ఈ ఏడాది ఆఫీస్‌ లీజింగ్‌ కొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. విభిన్నమైన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు, టెక్నాలజీ అనుకూల వాతావరణం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం.. ఇవన్నీ గ్లోబల్‌ క్యాపబిలిటీ కేంద్రాల (జీసీసీ) ఏర్పాటుకు వీలు కల్పిస్తోందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.

This website uses cookies.