అసలే కరోనా సమయం.. పైగా, అద్దె ఇంట్లో ఉంటే సవాలక్ష సమస్యలు. అందుకే చాలామంది ఒకట్రెండు గదులైనా వేసుకుని సొంతింట్లో ఉండేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. శివార్లలో గతంలో ప్లాటు కొనుక్కున్నవాళ్లు.. హైదరాబాద్ కాకుండా సొంతూరులో స్థలం కొన్నవారు.. ఇలాంటి వారిలో అధిక శాతం మంది సొంతిల్లు కట్టుకునేందుకు ప్రణాళికల్ని రచిస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు.. ఇలా సింహభాగం వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి.. కాస్త కష్టమైనా ఇల్లు కట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, సొంతంగా ఎవరైనా ఇల్లు కట్టుకునేందుకు ఎంత ఖర్చు అవుతుంది? (house construction estimation in telugu)
కరోనా కష్టకాలంలో సిమెంటు, ఉక్కు ధరలు ఆకాశాన్నంటాయి. ఇసుక, కంకర రేట్లు పెరిగాయ్. కార్మికుల వ్యయం గత మూడు నెలల్లో దాదాపు రెండింతలు అయ్యింది. మున్సిపల్ అనుమతికి అయ్యే ఖర్చు వేరే. శానిటరీ, హార్డ్‌వేర్ రేట్లు సరేసరి, ఇంటీరియర్స్ ఖర్చు ఎలాగూ ఉంటుంది. వీటన్నింటినీ సక్రమంగా నిర్వహిస్తేనే.. మనకు నచ్చిన కలల గ్రుహాన్ని కట్టుకోవచ్చు. అందుకే, దేనికెంత ఖర్చవుతుందో తప్పకుండా అవగాహన పెంచుకోవాలి.
ఇక్కడ పొదుపు వద్దు..
మూడు గదులైనా, మూడంతస్తుల మేడయినా అనుభవమున్న ఆర్కిటెక్టు ద్వారా ప్లాను వేయించాలి. మంచి నైపుణ్యమున్న స్ట్రక్చరల్ ఇంజినీరు, సూపర్ వైజర్‌ల నేతృత్వంలో ఇంటి నిర్మాణ పనులను జరిపించాలి. ఆర్కిటెక్ట్ ఇంటికి సంబంధించిన ప్లాన్లు ఇస్తారు. ప్లాటుకు సరిపడా స్థలంలో గదులెన్ని ఉండాలి? బిల్డింగ్ బయటి ప్రాంతం ఎలా రావాలి? పూజగది, వంట గది, పడక గది వంటివి ఎంత విస్తీర్ణంలో ఉండాలి? వాస్తు ప్రకారం ప్లాన్ ఇవ్వడం వరకూ ఆర్కిటెక్ట్‌దే బాధ్యత. అవసరమైతే, వాస్తు నిపుణుల సలహా ప్లాను సందర్భంలో తీసుకోవచ్చు.
స్ట్రక్చరల్ ఇంజినీరు అనుకోండి.. ఆర్కిటెక్ట్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం పునాదుల్లోని మట్టి స్వభావాన్ని బట్టి ఎలాంటి ఫౌండేషన్ వెళ్లాలి? కాలమ్స్ ఎక్కడెక్కడ రావాలి? బీములెక్కడ ఏర్పాటు చేయాలి? ఎంత మందంగా ఉండాలి? ఏయే సైజు గల ఉక్కును వాడాలి? మొత్తానికి, భవనం పటిష్ఠతను చూసుకునే బాధ్యత స్ట్రక్చరల్ ఇంజినీరుదేనని గుర్తుంచుకోండి.
ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్,
వైద్ ఆర్కిటెక్ట్స్