Categories: TOP STORIES

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌!

675 అడుగుల ఎత్తైన అపార్ట్ మెంట్

మొత్తం 30 వేల మంది నివాసం

నిర్మాణ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆకాశాన్ని తాకేలా ఎత్తైన భవానలను నిర్మిస్తున్నారు. భూముల విలువలు పెరగడం, ఇంటి స్థలాల కొరతతో ఇప్పుడు ఎక్కువగా స్కై స్క్రాపర్స్ కే మొగ్గు చూపుతున్నాయి నిర్మాణ సంస్థలు. మన హైదరాబాద్ లో కనిష్టంగా 25 అంతస్తుల నుంచి మొదలు గరిష్టంగా 60 అంతస్తుల వరకు భవనాల్ని నిర్మిస్తున్నారు. నిర్మాణరంగంలో సాంకేతికత పెరిగేకొద్ది అంతస్తులు పెరుగుతూ వస్తున్నాయి.

అయితే ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్ ను చైనాలో నిర్మించారన్న సంగతి కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కియాన్‌ జియాంగ్‌ సెంచురీ నగరంలో భారీ అపార్ట్ మెంట్ ను నిర్మించారు. మొత్తం 675 అడుగుల ఎత్తైన ఈ బహుళ అంస్తుల భవనం చైనాలోనే అద్భుత కట్టడంగా నిలుస్తోందని చెప్పంలో ఏ మాత్రం అతియోశక్తి లేదు.

మొత్తం 39 అంతస్తులతో ‘ఎస్‌’ ఆకారంలో ఉన్న ఈ భారీ అపార్ట్ మెంట్ ను 14 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ భవనంలో గరిష్ఠంగా 30 వేల మంది నివసించేంత విశాలంగా ఉంది. ఇంత భారీ నివాసమైనప్పటికీ ఇందులో వసతులకు మాత్రం ఎటువంటి కొదవ లేదు. నిత్యావసరాల నుంచి మొదలు ఏ అవసరాలకైనా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు.

షాపింగ్‌ మాల్స్‌, రెస్టారంట్లు, స్కూళ్లు, ఆసుపత్రులు, ఎంటర్టైన్మెంట్, సినిమా హైల్స్.. ఇలా సకల సౌకర్యాలు అక్కడే ఏర్పాటు చేశారు. ఈ భారీ భవన సముదాయ ఆవరణలో ఫిట్‌నెస్‌ సెంటర్లు, ఫుడ్‌ కోర్టులు, స్విమ్మింగ్‌ పూల్స్‌, సూపర్ మార్కెట్సు, సెలూన్ల తోపాటు ఎంతో ఆహ్లాదకరమైన పార్కులు కూడా ఉన్నాయి.

అత్యంత విశాలమైన ఈ అపార్ట్ మెంట్ లో ఇప్పటికే 20 వేల మంది నివాసం ఉంటుండగా, మరో 10 వేల మందికి సరిపడా ఏర్పాట్లు ఉన్నాయట. విస్తీర్ణాన్ని బట్టి ఇక్కడ 18 వేల నుంచి 50 వేల వరకు అద్దె ఉన్నట్లు చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత విశాలమైన, భారీ అపార్ట్ మెంట్ రీజెంట్ ఇంటర్నేషనల్‌ పేరుతో ఉన్న ఈ భవనం 2013లోనే ప్రారంభమైనప్పటికీ కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చంది.

వేలాది మంది ఒకే చోట నివసించే విధంగా చేపట్టిన ఈ అత్యాధునిక భవన నిర్మాణం అద్భుతమని, ఆర్కిటెక్టుల ప్రతిభకు నిదర్శనమంటూ రియల్ రంగ నిపుణులు కొనియాడుతున్నారు. ఈ భారీ అపార్ట్ మెంట్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

This website uses cookies.