Categories: TOP STORIES

అమ్మకానికి లక్ష ఇళ్లు!

హైడ్రా ప్రభావంతో హైదరాబాద్ లో
తగ్గిన ఇళ్ల అమ్మకాలు

నిర్మాణ రంగం కోలుకోవడానికి
మరికొంత సమయం

హైదరాబాద్ లో లక్ష ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకుని గృహ ప్రవేశానికి సిద్దంగా ఉన్నాయి. కరోనా సమయంలో మొదలుపెట్టన ప్రాజెక్టులన్నీ ఇప్పుడు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. అయితే హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న హైడ్రా ప్రభావం నిర్మాణ రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. హైడ్రా ధాటికి ఇళ్ల బ‌య్య‌ర్లు.. తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ఫ‌లితంగా, ఇళ్ల అమ్మకాల్లో స్థ‌బ్ద‌త ఏర్పడింది. గ్రేటర్ సిటీలో గృహ అమ్మకాలు పుంజుకోవడానికి మరికొంత సమయం పట్టవచ్చని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ నిర్మాణ రంగంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ రియాల్టీ మార్కెట్ ఆశాజనకంగా ఉండటంతో భారీ ఎత్తున నివాస, వాణిజ్య నిర్మాణాలను చేపట్టారు బిల్డర్లు. కాస్మోపాలిటిన్ సిటీగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి సంస్థలు, మల్డీనేషనల్ కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. దీంతో ఇక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో ఇళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో పెద్ద నిర్మాణ సంస్థలతో పాటు చిన్న బిల్డర్లు సైతం పెద్ద ఎత్తున నివాస, వాణిజ్య ప్రాజెక్టులను చేపట్టాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో హైరైజ్ నిర్మాణాల వేగం పుంజుకుంది.

2020-2021లో కరోనా సమయంలో మిగతా రంగాలన్నీ నెమ్మదించిన టైంలో గ్రేటర్ సిటీలో శరవేగంగా నిర్మాణాలు జరుపుకున్నాయి. అప్పుడు ప్రారంభమైన నిర్మాణ ప్రాజెక్టులన్నీ ఈ మూడు నాలుగేళ్లలో పూర్తి చేసుకున్నాయి. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ లో భారీస్థాయిలో ఇళ్లు, అపార్ట్ మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇందులో డబుల్ బెడ్రూం ఇళ్ల నుంచి మొదలు భారీ విస్తీర్ణంతో ట్రిపుల్, ఫోర్, ఫైవ్ బెడ్రూం అపార్ట్ మెంట్స్ ఉన్నాయి. కనీసంగా 1500 చదరపు అడుగుల నుంచి మొదలు 16000 చదరపు అడుగుల వరకు విస్తీర్ణంలో అపార్ట్ మెంట్స్, విల్లాలు నిర్మాణం పూర్తి చేసుకుని గృహ ప్రవేశానికి సిద్దంగా ఉన్నాయని చెబుతున్నారు. భారీ నివాస ప్రాజెక్టులతో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చిన్న బిల్డర్లు నిర్మించిన స్టాండ్ లోన్ అపార్ట్ మెంట్స్, ఇండిపెండెంట్ ఇళ్లు అన్నీ కలిసి దాదాపు లక్ష ఇళ్ల వరకు నిర్మాణం పూర్తి చేసుకున్నాయని రియల్ రంగ మార్కెటింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

అయితే ఇలా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లలో సుమారు 40 శాతం ఇళ్లు అమ్ముడుపోయాయని లెక్కలు చెబుతున్నాయి. మిగతా 60 శాతం ఇళ్లలో సగానికి పైగా ఎప్పుడూ ఇన్వెంటరీ ఉంటుందని రియల్ రంగ నిపుణులు అంటున్నారు. అయితే మిగతా ఇళ్ల అమ్మకాల్లోనే కొంత స్థ‌బ్ద‌త‌ ఏర్పడిందన్న ఆందోళన రియల్ రంగ వర్గాల్లో ఏర్పడింది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఇంటి కొనుగోలు అంత మంచిది కాదని భావిస్తున్నారట. అందుకే ఇంటి కొనుగోలు విషయంలో వేచిచూసే ధరణి అవలంబిస్తున్నారట గృహ కొనుగోలుదారులు. దీంతో హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాల్లో స్పష్టమైన తగ్గుదల కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం గ్రేటర్ సిటీలో నిర్మాణం పూర్తి చేసుకున్న దాదాపు లక్ష ఇళ్లు అందుబాటులో ఉన్నాయని రియల్ రంగ మార్కెటింగ్ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ పరిస్థితి కాస్త మెరుగుపడే వరకు ఇళ్ల అమ్మకాల్లో ఇలాగే నత్తనడక తప్పదని అంటున్నారు.

This website uses cookies.