ఇంటి పత్రాలు ఇవ్వకుండా ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న మహిళకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం-2 ఊరట కల్పించింది. ఆమె ఇంటి పత్రాలు, నిర్మాణ ప్లాన్ తో పాటు నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ ను వెంటనే ఇవ్వాలని సదరు కంపెనీని ఆదేశించింది. అంతేకాకుండా ఆమె భర్త తీసుకున్న రూ.42 లక్షల రుణాన్ని ఆమె చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆ మహిళ విషయంలో చోళమండలం ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ అనుసరించిన వైఖరి ఏమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నష్టపరిహారం కింది రూ.లక్ష, కోర్టు ఖర్చుల కింద మరో రూ.5 వేలు ఆమెకు చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసు వినియోగదారుల పరిధిలోకి రాదంటూ ఫైనాన్స్ కంపెనీ తరఫు న్యాయవాది చేసిన వాదనలతో ఫోరం విభేదించింది. కంపెనీ చర్యలు సేవాలోపం కిందకే వస్తాయని స్పష్టం చేసింది.
2016లో సుంకరి వెంకట నారాయణ వెంగయ్య అనే వ్యక్తి మల్కాజ్ గిరి ఆకుల నారాయణ కాలనీలోని 238 చదరపు గజాల స్థలంలో ఇల్లు నిర్మించుకున్నారు. ఇందుకోసం బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి రుణం తీసుకుని నెలనెలా ఈఎంఐ చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో 2019లో చోళమండలం ఫైనాన్స్ కంపెనీ ఆయన్ను సంప్రదించి తాము రూ.42 లక్షల రుణం ఇస్తామని పేర్కొంది. అనంతరం వెంగయ్య, ఆయన భర్య మల్లేశ్వరి పేరు మీద రుణం మంజూరు చేసింది. ఇందులో రూ.14 లక్షలు బ్యాంకు ఆఫ్ ఇండియా రుణం కింద చెల్లించి, మిగిలిన మొత్తాన్ని దంపతులకు బదిలీ చేసింది. అదే సమయంలో రుణం కవరేజీ కోసం దంపతులిద్దరూ హెచ్ డీఎఫ్ సీ నుంచి బీమా తీసుకున్నారు. అనంతరం 2020 నవంబర్ 14న వెంకట నారాయణ చనిపోయారు. ఈ నేపథ్యంలో వారి ఇంటి పత్రాలు తిరిగి ఇవ్వకుండా చోళమండలం కంపెనీ ముప్పుతిప్పలు పెట్టడంతో మల్లేశ్వరి.. వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు.
This website uses cookies.