ఎవరికైనా సొంతిల్లు అనేది పెద్ద కల. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల్లో చాలామందికి ఇది తీరని కలలానే మిగిలిపోతోంది. వారు ఇల్లు కొనుక్కోలేకపోవడానికి చాలా కారణాలున్నాయి. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రెండు గృహ నిర్మాణ పథకాలను ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లను ప్రధానమంతరి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద చేపడతామనేది ఒకటి కాగా.. అద్దె ఇళ్లు, మురికివాడల్లో నివసించే మధ్యతరగతి ప్రజల సొంత ఇల్లు కట్టుకోవడానికి లేదా కొనుక్కోవడానికి ఓ పథకం తీసుకురాబోతున్నామనేది మరొకటి.
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని మొత్తం పట్టణ కుటుంబాల్లో 17 శాతం మంది మురికివాడల్లో నివసిస్తున్నారు. పెద్ద నగరాల్లో అయితే ఇది మరీ ఎక్కువ. గ్రేటర్ ముంబైలో 41 శాతం, కోల్ కతాలో 30 శాతం, చెన్నైలో 29 శాతం మంది మురికివాడల్లోనే ఉంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా.. అందరికీ ఇళ్లు అనే అంశం అలాగే ఉండిపోతోంది. వాస్తవానికి దేశంలో ఇల్లు కట్టుకోవడం లేదా కొనుక్కోవడం అనేది చాలా ఖరీదైన అంశమే.
సగటు ధర నుంచి ఆదాయ నిష్పత్తి (పీటీఐ) 11గా ఉంది. అంటే సగటు కుటుంబం 90 చదరపు మీటర్ల అపార్ట్ మెంట్ కొనుగోలు చేయడానికి 11 సంవత్సరాల ఆదాయం అవసరం అన్నమాట. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాల్లో ఇది అందుబాటులో ఉండగా.. బంగ్లాదేశ్, శ్రీలంక, చైనా వంటి దేశాల పీటీఐ మనదేశం కంటే దారుణంగా ఉంది. ఇక ఇళ్ల ధరలు పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి. కాలక్రమేణా ధరలలో వచ్చే పెరుగుదల ఒకటి కాగా.. నిర్మాణాత్మక కారణాలు మరొకటి. ఇందులో మార్పు రావాలంటే భూముల మార్కెట్ ను సంస్కరించడం అతి చక్కని మార్గమని నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత మరింత పెరుగుతుందని.. కొనుగోలుదారుల సామర్థ్యం కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు.
1991-2021 మధ్య వార్షిక ప్రాతిపదికన దేశంలో ఇళ్ల ధరలు 9.3 శాతం పెరిగాయి. కాగా, అత్యంత పారదర్శక రియల్ ఎస్టేట్ పరిశ్రమ ఉన్న దేశాల సగటు పీటీఐ 8గా ఉండగా.. తక్కువ పారదర్శకత ఉన్న దేశాల పీటీఐ 14గా ఉంది. రెరా, భూ రికార్డుల డిజిటలైజేషన్ వంటి సంస్కరణల ఫలితంగా కొన్ని సంవత్సరాలుగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మన దేశం అత్యుత్తమ మెరుగుదలలో ఒకటిగా ఉన్నప్పటికీ, ఇంకా సెమీ పారదర్వక ర్యాంకులోనే ఉంది. ఇందుకు ప్రధాన కారణం.. విశ్వసనీయమైన, కఠినమైన భూ వినియోగ ప్రణాళిక లేకపోవడమే. దేశంలో కేవలం 28 శాతం నగరాలు మాత్రమే మాస్టర్ ప్లాన్ ఆమోదించాయి. ఈ నేపథ్యంలో కొనుగోలుదారుల స్తోమత మెరుగుపరచడంతోపాటు ప్రణాళికాబద్ధంగా, పారదర్శక పద్ధతిలో భూ సరఫరా విడుదల చేయడం వల్ల అందరికీ సొంతిల్లే అనే కల ఆచరణలో నిజమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.