- తగ్గిన ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు
- రెసిడెన్షియల్ విభాగంలో భారీ తగ్గుదల
- వేర్ హసింగ్ మినహా అన్నింటా ఇదే పరిస్థితి
- ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలే కారణం
- నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడి
కరోనా తర్వాత గాడిన పడిన భారతీయ రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ కుదుపులకు లోనవుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిణామాలు ఈ రంగంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ఏడాది ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల్లో తగ్గుదల నమోదు కావడమే ఇందుకు నిదర్శనమని నైట్ ఫ్రాంక్ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది తొమ్మిది నెలల్లో ఆఫీస్, రెసిడెన్షియల్, రిటైల్, వేర్ హౌసింగ్ విభాగాల్లో 4.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులొచ్చాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఇది 25 శాతం తక్కువ. 2021 మొదటి తొమ్మిది నెలల్లో 5.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. కానీ ఈ ఏడాది అన్ని విభాగాల్లో తగ్గుదల నమోదైంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ అస్థిరత వంటివి ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు తగ్గడానికి కారణమయ్యాయి. ఇక 2022 మొదటి తొమ్మిది నెలల్లో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి ఆఫీసు విభాగం అత్యధికంగా 55 శాతం వాటా కలిగి ఉంది. దీని తర్వాత వేర్ హౌసింగ్ 29 శాతం, రెసిడెన్షియల్ 9 శాతం, రిటైల్ రంగం 7 శాతం వాటాలు కలిగి ఉన్నాయి. ముంబై అత్యధికంగా 60 శాతం పెట్టుబడులను పొందగా.. బెంగళూరు 17 శాతంతో రెండో స్థానంలో ఉంది.
రెసిడెన్షియల్ లో ఇలా..
2022 మొదటి తొమ్మిది నెలల్లో రెసిడెన్షియల్ రంగం 370 మిలియన్ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు పొందింది. గతేడాదితో పోలిస్తే ఇది ఏకంగా 63 శాతం తక్కువ కావడం గమనార్హం. 2021 మొదటి తొమ్మిది నెలల్లో 1187 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. కరోనా సంవత్సరం 2020లో ఇది 368 మిలియన్ డాలర్లుగా ఉంది. అంతకుముందు ఎన్నడూ ఇంత తక్కువ పెట్టుబడులు రాలేదు. ఒకవిధంగా చెప్పాలంటే కరోనా కారణంగా రియల్ పరిశ్రమ ఒడుదొడుకులకు లోనై పెట్టుబడులు కోల్పోయిందో.. మళ్లీ ప్రస్తుత పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. పెరుగుతున్న నిత్యావసర వస్తువులు, వడ్డీ రేట్లు పెరగడం వంటి కారణాల వల్ల పెట్టుబడిదారులు జాగ్రత్తపడుతున్నారు. ఈ కారణంగానే పెట్టుబడుల్లో క్షీణత నమోదైంది.
ఆఫీస్ రంగం పర్వాలేదు..
పెట్టుబడులకు సంబంధించి కార్యాలయ రంగం తన హవా కొనసాగించింది. చాలామంది మొగ్గు చూపే ఈ రంగం ఈసారి కూడా చక్కని పెట్టుబడులే సాధించింది. ఈ ఏడాది మొదటి మూడు త్రైమాసికాల్లో 2299 మిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని ఆకర్షించింది. గతేడాది ఇదే వ్యవధిలో 2882 మిలియన్ పెట్టుబడులతో పోలిస్తే ఇది కేవలం 15 శాతం తక్కువ. ఇక ఈ ఏడాది పెట్టుబడుల్లో 67 శాతం పెట్టుబడులు రెడీగా ఉన్న ప్రాపర్టీలపై పెట్టగా.. 33 శాతం పెట్టుబడులు నిర్మాణంలో ఉన్న, కొత్త వాటిపై పెట్టారు. ఆఫీస్ రంగానికి సంబంధించి 6131 మిలియన్ డాలర్లతో ముంబై తొలి స్థానంలో ఉండగా.. 4601 మిలియన్ డాలర్లతో బెంగళూరు తొలి రెండు స్థానంలో నిలిచింది. 3311 మిలియన్ డాలర్లతో ఢిల్లీ, 2081 మిలియన్ డాలర్లతో హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
రిటైల్ రంగంలో భారీ తగ్గుదల..
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు రిటైల్ రంగంలో ఈసారి భారీగా తగ్గాయి. మొదటి మూడు త్రైమాసికాల్లో కేవలం 303 మిలియన్ డాలర్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. గతేడాది తొమ్మిది నెలలతో పోలిస్తే ఇది ఏకంగా 63 శాతం తక్కువ. 2021 మొదటి మూడు త్రైమాసికాల్లో 817 మిలియన్ పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది అశ్విన్ షెత్ గ్రూప్ వివియానా మాల్ లో లేక్ షోర్ అడ్వైజర్స్ పెట్టుబడులు పెట్టగా.. ఫీనిక్స్ మిల్స్ లో జీఐసీ అదనపు వాటా తీసుకుంది. అధిక ద్రవ్యోల్బణమే రిటైల్ రంగంలో పెట్టుబడులు క్షీణతకు ప్రధాన కారణం. ఇక ఈ ఏడాది రిటైల్ పెట్టుబడుల్లో కొత్తవాటిపై 44 శాతం, నిర్మాణంలో ఉన్నవాటిపై 31 శాతం, రెడీగా ఉన్నవాటిపై 13 శాతం నమోదయ్యాయి. నగరాలవారీగా చూస్తే 1664 మిలియన్ డాలర్లతో ముంబై మొదటి స్థానంలో ఉండగా.. 512 మిలియన్ డాలర్లతో బెంగళూరు రెండో స్థానంలో ఉంది. 483 మిలియన్ డాలర్లతో పుణె మూడో స్థానంలో, 267 మిలియన్ డాలర్లతో చండీగఢ్ నాలుగో స్థానంలో, 197 మిలియన్ డాలర్లతో హైదరాబాద్ ఐదో స్థానంలో ఉన్నాయి.
వేర్ హౌసింగ్ లో కాస్త పెరుగుదల
లాజిస్టిక్, పారిశ్రామిక విభాగాల్లో పెట్టుబడులు బాగానే ఉండటం విశేషం. ఆఫీస్, రెసిడెన్షియల్, రిటైల్ విభాగాలతో పోలిస్తే.. లాస్ట్ మైల్ డెలివరీ, లాజిస్టిక్స్ కోసం నిరంతరం పెరుగుతున్న అవసరం కారణంగా ఈ విభాగంలో పెట్టుబడిదారులు అధిక విశ్వాసం కలిగి ఉన్నారు. వేర్ హౌసింగ్ విభాగంలో ఈ ఏడాది పెట్టుబడులు కాస్త పెరిగాయి. మొదటి తొమ్మిది నెలల్లో 1222 మిలియన్ డాలర్ల పెట్టుబడులు నమోదయ్యాయి. ఇది గతేడాది ఇదే వ్యవధిలో వచ్చిన 1099 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో పోలిస్తే 11 శాతం ఎక్కువ.
గతేడాది మొత్తం ఈ విభాగంలో 1313 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తంగా చూస్తే.. కరోనా తర్వాత గాడిన పడిన రియల్ రంగం మళ్లీ ఒడుదొడుకులు ఎదుర్కొంటోందని తెలుస్తోంది. సమర్థవంతంగా టీకాలు వేయడం, ద్రవ్య విధానంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా 2021లో భారత్ లోకి పెట్టుబడులు పెరిగాయి. అయితే, 2022కి వచ్చేసరికి మళ్లీ తిరోగమనంలోకి వెళ్లిపోయింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు, పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతలు ఈ ఏడాది పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపించాయి. పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరించే ధోరణి అనుసరించడంతో పెట్టుబడులు తగ్గాయి.