Categories: TOP STORIES

లగ్జరీ హౌసింగ్ దూకుడు

డీఎల్ఎఫ్ సంస్థ కేవలం 72 గంటల్లో ఒక బిలియన్ డాలర్ల రెసిడెన్షియల్ మార్కెట్ ను విక్రయించగా.. ప్రత్యర్థి కంపెనీ గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎంపిక చేసిన ఖాతాదారులను మాత్రమే ఆహ్వానించి మూడు మిలియన్ డాలర్ల విలువైన అపార్ట్ మెంట్లు అమ్ముతోంది. ఈ రెండు ఉదంతాలూ దేశంలో లగ్జరీ మార్కెట్ ఊపందుకుందనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. మల్టీ లెవెల్ పార్కింగ్, స్పా, గ్రీనరీతో కూడిన విశాలమైన ప్రదేశాలు, వేడినీళ్ల స్విమింగ్ పూల్ వంటి సౌకర్యాలతో ఉండే విశాలమైన, అధిక ధరతో కూడిన అపార్ట్ మెంట్ల హవా ప్రస్తుతం నడుస్తోందని ప్రాపర్టీ డెవలపర్లు చెబుతున్నారు.

దేశంలోని ఇరుకైన, రద్దీగా ఉండే నగరాల్లోని వ్యక్తిగత ఇళ్లు, పాత అపార్ట్ మెంట్లలో ఇలాంటి సౌకర్యాలు లేవు. కోవిడ్ నేపథ్యంలో చాలామంది ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి రావడంతో ఇప్పుడు అందరూ విశాలమైన ఇళ్లకే మొగ్గు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డీఎల్ఎఫ్ ప్రాజెక్టుకు అంత గిరాకీ పెరిగింది. గురుగ్రామ్ లో డీఎల్ఎఫ్ ఆర్బర్ ప్రాజెక్టులోని 1137 అపార్ట్ మెంట్ల కోసం 3 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఒక్కోటీ రూ.7 కోట్ల విలువైన ఈ ఫ్లాట్ కోసం జనాలు క్యూలో నిలబడ్డారు. ఇక గోద్రేజ్ ప్రాపర్టీస్ విషయానికొస్తే.. 8 అంతస్తుల్లోని 46 లగ్జరీ ఫ్లాట్ల అమ్మకానికి కేవలం 160 మందిని ఆహ్వానించింది. హాట్ స్విమింగ్ పూల్, నానీ ఆన్ కాల్ వంటి సేవలను చూపించి అప్పటికప్పుడు 17 ఫ్లాట్లు అమ్మేసింది.

Godrej Properties లగ్జరీ హౌసింగ్ లో గత దశాబ్ద కాలంలోనే ఇంతటి భారీ డిమాండ్ చూడలేదని.. లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్ పునరుద్ధరణ మార్గంలో ఉందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ రీసెర్చ్ హెడ్ ప్రశాంత్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. డీఎల్ఎఫ్ ప్రాజెక్టులోని గ్రాండ్ రిసెప్షన్ ఏరియా, హైస్పీడ్ ఎలివేటర్లు, జాగింగ్ చేయడానికి తగినంత ప్లేస్ తనకు నచ్చాయని.. అందుకే తాను అద్దెకు ఉంటున్న అపార్ట్ మెంట్ వదిలి డీఎల్ఎఫ్ లో ఫ్లాట్ బుక్ చేసుకున్నానని ఓ కొనుగోలుదారు వెల్లడించారు. 2022లో లాంచ్ అయిన అన్ని హౌసింగ్ ప్రాజెక్టుల్లో రూ.కోటిన్నర కంటే ఎక్కువ విలువైన ఇళ్ల అమ్మకాలు 17 శాతం ఉండగా.. ఒకప్పుడు జనాదరణ పొందిన రూ.40 లక్షలలోపు సరసమైన గృహాల అమ్మకాలు 20 శాతం ఉన్నాయి. మొత్తమ్మీద గతేడాది రికార్డు స్థాయిలో 65,700 లగ్జరీ యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది 2021 కంటే మూడు రెట్లు అధికం కావడం గమనార్హం. ఇక లగ్జరీ గృహాల అమ్మకాల్లో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రముఖ వేలం సంస్థ సోత్ బీ సర్వే చేసిన అధిక నికర విలువ కలిగిన భారతీయుల్లో 61 శాతం మంది తాము ఈ ఏడాది లగ్జరీ ప్రాపర్టీని కొనుగోలు చేయాలని చూస్తున్నట్టు వెల్లడించారు.

This website uses cookies.