ఫామ్ ల్యాండ్స్ పేరుతో వ్యవసాయ భూములు కొనుగోలు చేసి, కాస్త పచ్చగడ్డితో కప్పేసి, కొన్ని మొక్కలు నాటేయడం ద్వారా అటు ఆహారోత్పత్తికే కాకుండా ఇటు పర్యావరణ వ్యవస్థకు కూడా తీవ్రమైన ముప్పు ఉంటుంది. హైదరాబాద్ చుట్టుపక్కల వ్యవసాయ భూములను ఫామ్ భూములుగా కొనుగోలు చేసినప్పటికీ, వాటిని సాగు చేయడం కోసం కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం వినియోగిస్తే.. భవిష్యత్తులో ఆహారం ఎలా దొరుకుతుంది? ఎకరాల కొద్దీ భూముల్లో వెంచర్లు వేసుకుంటూ వెళితే ఇక వ్యవసాయం చేసేదెవరు? మనకు తిండి పెట్టేదెవరు?
దాదాపు 10 వేల ఏళ్ల క్రితమే మనుష్యులు వ్యవసాయం చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం భూమిపై సుమారు 40 శాతం మేర సాగు యోగ్యమైన భూమి ఉంది. ప్రస్తుత జనాభా అవసరాలకు తగినంత ఆహారోత్పత్తి జరుగుతోంది. కానీ భవిష్యత్తులో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన ఆహారం ఎలా దొరుకుతుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. వ్యవసాయ భూమిని ఫామ్ ల్యాండ్స్ గా మారుస్తున్న తరుణంలో ఇది జవాబు లేని ప్రశ్నగా మారింది. అయితే, దీని పరిష్కారానికి రెండో వ్యవసాయ విప్లవం అవసరం లేదని వైద్ (వీఏఐడీ) ఆర్కిటెక్ట్స్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ వి.సురేష్ కుమార్ చెబుతున్నారు. తొలి వ్యవసాయ విప్లవం అనేది సాగు భూముల విస్తరణ ద్వారా వచ్చింది. కానీ ఈసారి అది వీలు కాని పని అంటున్నారు.
సంప్రదాయ వ్యవసాయ భూముల్లో రోడ్లు, ప్లాట్లతో అభివృద్ధి చేయడం ఎక్కువైంది. అక్కడ ఎలాంటి తోటలూ ఉండవు. ఇక వన్యప్రాణులు జాడే ఉండదు. పైగా పెద్ద మొత్తం గ్రీన్ హౌస్ వాయువులు వెలువడతాయి. వీటిని సరి చేయడానికి సహజమైన గ్రౌండ్ లేఔట్ కలిగి, ప్రణాళికాబద్ధమైన పంటలతో, పంటల మధ్య కదులుతూ, నిర్దేశిత మోతాదులో ఎరువులను చల్లే ఫీల్డ్ రోబోలు ఉండాలి. నేల లోపల వందలాది సెన్సర్లు పోషకాలు, నీటి స్థాయిలపై డేటా సేకరిస్తాయి. ఈ సమాచారంతో అనవసరమైన నీటి వినియోగాన్ని తగ్గించవచ్చు.
అంతేకాకుండా రైతులు పొలమంతా ఎరువులు చల్లి కాలుష్యం కలిగించే అవకాశం కూడా ఉండకుండా ఎక్కడ ఎంత మోతాదులో ఎరువు వేయాలో సులభంగా తెలుసుకోవచ్చు. నిజానికి ఇలాంటి పద్ధతులు ఇప్పటికే వాడుకలో ఉన్నాయి. అయితే, ఎక్కువ మంది ప్రజలు వాటిని అవలంబించడం వల్ల మరింత ప్రయోజనం కలుగుతుందని సురేష్ కుమార్ చెబుతున్నారు. కొత్త వ్యవసాయ భూములకు స్థానిక రైతుల నుంచి తగిన మద్దతు పొందడం ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకోవాలని.. భూమి వినియోగాన్ని నిలుపుకోవడమే కాకుండా స్థానిక వ్యవసాయ విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచిస్తున్నారు.
This website uses cookies.