వాసవి గ్రూప్ స్పష్టీకరణ
అవన్నీ కట్టుకథలు.. నమ్మకండి
బయ్యర్లు ప్యానిక్ కానక్కర్లేదు..
అసత్య ప్రచారాన్ని నమ్మకండి
హైదరాబాద్ నిర్మాణ రంగంలో.. కోర్ వ్యాల్యూస్‌ని పొందుపర్చుకుని.. బయ్యర్ల అవసరాలకు తగ్గట్టుగా ప్రాజెక్టుల్ని చేపట్టే రియల్ సంస్థల్లో.. వాసవి గ్రూప్ ఎల్లప్పుడు ముందు వరుసలో ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో వాసవి గ్రూప్ సంస్థ.. వాసవి సరోవర్ అనే లగ్జరీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. జీహెచ్ఎంసీ, రెరా అనుమతి పొందిన ఈ నిర్మాణాన్ని.. సుమారు 21.48 ఎకరాల్లో డెవలప్ చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం వాసవి గ్రూప్ జీహెచ్ఎంసీకి సుమారు 38 కోట్లు, అప్పటి టీఎస్ రెరాకు సుమారు ఐదు లక్షల ఫీజును చెల్లించింది.
వాసవికి మైసమ్మ చెరువు
సుందరీకరణ బాధ్యతలు
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద కూకట్ పల్లి మూసాపేటలోని మైసమ్మ చెరువు పరిరక్షణ పనుల బాధ్యతలను వాసవి గ్రూప్ కు అప్పగిస్తూ నీటిపారుదల విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరిగేషన్ విభాగంతో సమన్వయం చేసుకుని చెరువు ఎఫ్టీఎల్ సరిహద్దులు నిర్ధారించాలని సూచించింది. ఎఫ్టీఎల్ సరిహద్దు పరిధిలో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టొద్దని స్పష్టం చేసింది. అలాగే ప్రతిపాదిత పనులు చెరువు కింద భాగంలోని బఫర్ జోన్ లో ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమిలో చేపట్టాల్సి ఉన్నందున టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి ఆయా వ్యక్తులను గుర్తించి, టీడీఆర్ కింద భూ సేకరణ చేయాలని వాసవి గ్రూప్ కు సూచించింది.
ఆయా పనులన్నీ పూర్తి చేసిన తర్వాత చెరువు పనులు చేపట్టాలని, దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించి హైదరాబాద్ లేక్స్ అండ్ వాటర్ బాడీస్ మేనేజ్ మెంట్ (హెచ్ఎల్ అండ్ డబ్ల్యూబీఎం) సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ తో ఒప్పందం చేసుకోవాలని ఆదేశించింది. దీంతో, ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పినట్లే వాసవి సంస్థ మైసమ్మ చెరువును డెవలప్ చేస్తోంది.
రెవెన్యూ స్కెచ్, గవర్నమెంట్ రికార్డుల ప్రకారం.. వాసవి సరోవర్ నిర్మిస్తున్న సరోవర్ ప్రాజెక్టు.. బఫర్ జోన్ పరిధిలోకి రాదు. కాముని చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోకి కూడా రాదు. కాముని చెరువు మరియు చిన్న మైసమ్మ చెరువును కనెక్ట్ చేస్తూ.. పదిహేడు మీటర్ల ఓపెన్ నాలాను కట్టాలనే నిబంధన ఉంది. దీంతో, ఈ పనిని వచ్చే వర్షకాలంలోపు పూర్తి చేసేలా వాసవి గ్రూప్ ప్రణాళికల్ని రచించింది. మైసమ్మ చెరువుకు సంబంధించి.. గమనించాల్సిన అంశం ఏమిటంటే.. సుందరీకరణ కోసం గత ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
బిల్డర్ ఇష్టం వచ్చినట్లు కట్టకుండా.. ప్రణాళికాబద్ధంగా డెవలప్ చేసేందుకు.. ప్రభుత్వ అధికారుల్ని పర్యవేక్షణ నిమిత్తం నియమించింది. ఈ చెరువు డెవలప్‌మెంట్ పనులు జాయింట్ కలెక్టర్, ఎమ్మార్వోల నేతృత్వంలో జరిగేవి. అందులో ఇర్రిగేషన్ డిపార్టుమెంట్ అధికారులూ ఉన్నారు. వారి ప్లానింగ్, పర్యవేక్షణలో సుందీరకరణ పనులు జరుగుతున్నాయి తప్ప.. వాసవి సంస్థ సొంతంగా ఈ పనుల్ని చేయట్లేదు. ఒకవేళ ఈ చెరువును సుందరీకరణ చేయవద్దంటే.. అసలా చెరువు జోలికే వాసవి గ్రూప్ పోయేది కాదనే విషయాన్ని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి.
తాత్కాలిక రహదారి ఏర్పాటు
నీటిపారుదల శాఖ నుండి వచ్చిన ఇన్‌పుట్‌ల ప్రకారం, మొదట్లో నిర్దేశిత ఎత్తులో బండ్‌ను ఏర్పాటు చేయాలి. ఇది అనేక సవాళ్లతో కూడుకున్న విషయం. బండ్‌ను నిర్మించే క్రమంలో మట్టిని తరలించడానికి రాజీవ్ నగర్‌లో రహదారులు ఇరుకుగా ఉన్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి.. బండ్ నిర్మాణాన్ని సులభతరం చేసేందుకు తాత్కాలిక రహదారి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.
పనులన్నీ పూర్తయ్యాక ఈ రహదారిని తొలగిస్తారని గుర్తుంచుకోండి. ఇది అరవై ఐదు శాతం పూర్తయ్యాక స్థానిక బస్తీ వాసులు డ్రైనేజీ, మురుగునీటి పైప్‌లైన్లను ఏర్పాటు చేయడానికి పట్టుబట్టగా.. సంబంధిత ప్రభుత్వ విభాగాలతో చర్చించి.. దిగువకు నీరు వెళ్లడానికి 1400 ఎంఎం పైప్‌లైన్ వేయడానికి వాసవి అంగీకరించింది.
వాసవి చెప్పే వాస్తవాలివే..
2023 జనవరి 25న తెలంగాణ నీటిపారుదల శాఖ చిన్న మైసమ్మ చెరువును సుందరీకరణకు ప్రాథమికంగా అంగీకరించింది.
2023 మార్చి 27 అప్పటి మంత్రి కేటీఆర్ మైసమ్మ చెరువు అభివృద్ధిని చేసేందుకు ఒప్పుకున్నారు. అదే రోజు వాసవి సంస్థ చేస్తున్న మంచి పనిని గుర్తించి ఒక సర్టిఫికెట్‌ను కూడా అందజేశారు.
2024 మార్చి 7న నీటిపారుదల శాఖ.. సీఎస్సార్ యాక్టివిటీలో భాగంగా.. అభివృద్ధి పనుల్ని చేయడానికి ఒప్పుకుంది.
జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ తదితరులు సైట్ ఇన్స్‌పెక్షన్ కూడా చేశారు.
జీహెచ్ఎంసీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. రెండేళ్లలోపు అంటే, 2026 జులై 10న చిన్న మైసమ్మ చెరువు సుందరీకరణ పనులు పూర్తి కావాలి.
వాసవి బయ్యర్లు..
ప్యానిక్ అవ్వొద్దు!
వాసవి సరోవర్ ప్రాజెక్టుకు వెళ్లేందుకు గతంలో రోడ్డు కూడా ఉండేది కాదు. ఆ రోడ్డు పనులు జీహెచ్ఎంసీ ద్వారా ఆలస్యమవుతుందనే ఉద్దేశ్యంతో.. వాసవి సంస్థ ఒక అడుగు ముందుకేసి.. ప్రత్యేకంగా రోడ్డును వేయించింది. మైసమ్మ చెరువు సుందరీకరణ పనులు దాదాపు యాభై శాతం పూర్తయ్యాక.. హఠాత్తుగా కొందరు వ్యక్తులు..కావాలని.. పనిగట్టుకుని.. ఈ ప్రాజెక్టు గురించి చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎట్టి పరిస్థితిలో నమ్మకూడదని వాసవి గ్రూప్ చెబుతోంది.