poulomi avante poulomi avante

హైద‌రాబాద్‌లో మ‌ళ్లీ రియ‌ల్ బూమ్!

తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ‌తామ‌ని.. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌లో స‌రికొత్త రియ‌ల్ బూమ్ వ‌స్తుంద‌ని మంత్రి ఉత్త‌మ్ కూమార్ రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. మంగ‌ళ‌వారం నోవాటెల్‌లో జ‌రిగిన క్రెడాయ్ తెలంగాణ స్టేట్‌కాన్ 2024కు ఆయ‌న మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డితో క‌లిసి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్మాణ రంగానికి అన్నివేళ‌లా తోడుగా ఉంటుంద‌ని భ‌రోసానిచ్చారు.

తెలంగాణ‌లో ప‌ట్ట‌ణీక‌ర‌ణ పెరుగుతున్న నేప‌థ్యంలో.. క్రెడాయ్ తెలంగాణ బిల్డ‌ర్లు క్రియాశీల‌క పాత్ర పోషిస్తున్నారని ప్ర‌శంసించారు. బిల్డ‌ర్లు రాష్ట్రాభివృద్ధిలో భాగ‌స్వామ్యులుగా ప‌రిగ‌ణిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ స్టేట్‌కాన్‌లో బిల్డ‌ర్లు విన్న‌వించే స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించే విధంగా త‌గిన చ‌ర్య‌ల్ని తీసుకుంటామ‌ని తెలిపారు. క‌రీంన‌గ‌ర్ అయినా వ‌రంగ‌ల్ అయినా బిల్డ‌ర్ల‌కు అండ‌గా ఉంటామ‌ని.. ఈ రంగానికి ఎలాంటి స‌మ‌స్య‌లొచ్చినా తాము తోడుగా ఉంటామ‌ని హామీనిచ్చారు. తెలంగాణలో నిర్మాణ రంగానికి ప్ర‌భుత్వం అన్నివిధాలుగా అండ‌గా నిలుస్తుంద‌న్నారు.

హైద‌రాబాద్ గ్లోబ‌ల్ డెస్టినేష‌న్‌గా అవ‌త‌రిస్తుంద‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. యావ‌త్ తెలంగాణ వృద్ధి రేటు దేశంలోనే అధిక శాతం ఉండే విధంగా అభివృద్ధి చేస్తామ‌న్నారు. జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు, ఓఆర్ఆర్‌, పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే, గోదావ‌రి జ‌లాలు, కృష్ణా జ‌లాలు, మెట్రోకు శంకుస్థాపన వంటివి ఆనాడు త‌మ కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే చేసింద‌ని గుర్తు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం, తామంతా క‌లిసిక‌ట్టుగా ప‌ని చేసి.. హైద‌రాబాద్‌కు అంత‌ర్జాతీయ ఖ్యాతినార్జించేలా ప‌ని చేస్తామ‌ని వివ‌రించారు. మూసీ డెవ‌ల‌ప్‌మెంట్‌, రీజిన‌ల్ రింగ్ రోడ్డు, ముచ్చ‌ర్ల ప్రాంతం ఫ్యూచ‌ర్ సిటీగా డెవ‌ల‌ప్ చేయ‌డం, స్కిల్ యూనివ‌ర్శిటీ ఏర్పాటు వంటి వాటితో హైద‌రాబాద్ న‌గ‌రాన్ని మ‌రో లెవెల్‌కు తీసుకెళ‌తామ‌న్నారు.

తెలంగాణ నిర్మాణ రంగం అడిగిన డిమాండ్ల‌ను ప్ర‌భుత్వంతో ప‌రిష్క‌రిస్తామ‌ని తెలిపారు. తెలంగాణ స్టేట్‌కాన్‌కు ఇంత భారీ సంఖ్య‌లో బిల్డ‌ర్లు హాజ‌ర‌వుతార‌ని అనుకోలేద‌ని మంత్రి వ్యాఖ్యానించారు. స్కిల్ యూనివ‌ర్శిటీ ఏర్పాటు చేస్తున్నామంటే.. ఈ ప‌రిశ్ర‌మ ప‌ట్ల త‌మ ప్ర‌భుత్వం ఎంత సీరియ‌స్‌గా ఉందో అర్థం చేసుకోవాల‌న్నారు. స్టాంప్ డ్యూటీని త‌గ్గించే విష‌య‌మై ప్ర‌భుత్వంతో చ‌ర్చించి ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని తెలిపారు. నిర్మాణ రంగానికి మ‌రో బూమ్ వ‌చ్చేందుకు అవ‌స‌ర‌మ‌య్యే నిర్ణ‌యాల‌న్నీ ప్ర‌భుత్వం తీసుకుంటుంద‌ని హామినిచ్చారు. ప్ర‌పంచ‌స్థాయి ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ను హైద‌రాబాద్‌లో డెవ‌ల‌ప్ చేస్తామ‌న్నారు.

2-3 నెల‌ల్లో ఆర్ఆర్ఆర్ ప‌నులు షురూ..

ఈ సంద‌ర్భంగా మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాల నుంచి బిల్డ‌ర్లు పాల్గొన‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. ఈ స‌ద‌స్సు తెలంగాణ నిర్మాణ రంగానికి బాట‌లు వేసే వేదిక‌గా కొనియాడారు. కాల ప‌రిమితిని ఏర్పాటు చేసి ఓఆర్ఆర్‌, ఎయిర్‌పోర్టు, పీవీ న‌ర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వంటివి ఏర్పాటు చేశామ‌ని గుర్తు చేశారు. కోకాపేట్‌, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేసిన ఘ‌న‌త త‌మ‌కే ద‌క్కుతుంద‌న్నారు. గ‌తంలో ఔట‌ర్ రింగ్ రోడ్డు గేమ్ ఛేంజ‌ర్‌గా మారి.. హైద‌రాబాద్‌కు ఎలాగైతే ఇన్వెస్ట్‌మెంట్లు వ‌చ్చాయో.. అదే విధంగా ప్ర‌స్తుతం రీజిన‌ల్ రింగ్ రోడ్డును సూప‌ర్ గేమ్ ఛేంజ‌ర్‌గా మారుతుంద‌న్నారు.

ఇందుకు సంబంధించిన టెండ‌ర్లను పిలిచి రెండు, మూడు నెల‌ల్లో ప‌నుల్ని ఆరంభిస్తామ‌న్నారు. ముచ్చ‌ర్ల ఫార్మా కారిడార్‌ను ఫోర్త్ సిటీగా డెవ‌ల‌ప్ చేస్తున్నామ‌ని.. స్కిల్ యూనివ‌ర్శిటీ ఏర్పాటుతో ద‌క్షిణ హైద‌రాబాద్‌లో అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఇందుకోసం బీసీసీఐని సంప్ర‌దించామ‌ని తెలిపారు. తాము ఇర‌వై నాలుగు గంట‌లు నిర్మాణ రంగానికి అందుబాటులో ఉంటామ‌న్నారు. నిర్మాణ రంగానికి సపోర్టుగా ఉంటామ‌ని హామీనిచ్చారు.

భువ‌న‌గిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. నిర్మాణ రంగం వృద్ధి చెందేందుకు అవ‌స‌ర‌మ‌య్యే నిర్ణ‌యాల‌న్నీ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో క్రెడాయ్ నేష‌న‌ల్ సెక్ర‌ట‌రీ గుమ్మి రాంరెడ్డి, క్రెడాయ్ నేష‌న‌ల్ ఈసీ మెంబ‌ర్ చెరుకు రామ‌చంద్రారెడ్డి, క్రెడాయ్ తెలంగాణ ఛైర్మ‌న్‌, ప్రెసిడెంట్‌, సెక్ర‌ట‌రీలు ముర‌ళీకృష్ణారెడ్డి, ప్రేమ్‌సాగ‌ర్‌రెడ్డి, అజ‌య్‌కుమార్‌.. క్రెడాయ్ తెలంగాణ (ప్రెసిడెంట్‌- ఎల‌క్ట్‌) ఇంధ్ర‌సేనారెడ్డి, క్రెడాయ్ హైద‌రాబాద్ అధ్య‌క్షుడు రాజశేఖ‌ర్‌రెడ్డి, క్రెడాయ్ హైద‌రాబాద్ మాజీ అధ్య‌క్షుడు ఎస్ఎంఆర్ రాంరెడ్డి, పౌలోమీ ఎస్టేట్స్ ఎండీ ప్ర‌శాంత్ రావు, జ‌న‌ప్రియ ఇంజినీర్స్ అధినేత కె.ర‌వీంద‌ర్‌రెడ్డిల‌తో పాటు తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా సుమారు ప‌దిహేను ఛాప్ట‌ర్ల బిల్డ‌ర్లు పాల్గొన్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles