ఇన్ పుట్ వ్యయాలు తగ్గడంతో వార్షిక ప్రాతిపదికన సిమెంట్ బస్తా ధర 8 శాతం తగ్గి రూ.340కి చేరింది. దీంతో సిమెంట్ కు డిమాండ్ భారీగా పెరిగి అమ్మకాలు ఎక్కువయ్యాయి. గత రెండేళ్లలో సిమెంట్ ధరలు వార్షిక ప్రాతిపదికన కాస్త తగ్గాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ బస్తా ధర సగటును రూ.375 ఉండగా.. 2024 ఆర్థిక సంవత్సరంలో అది రూ.365కి తగ్గింది. ఇన్ పుట్ వ్యయాలు తగ్గడమే సిమెంట్ ధరలు తగ్గడానికి ప్రధాన కారణం. 2024 మే నెలలో బొగ్గు ధరలు 45 శాతం మేర తగ్గాయి.
అలాగే పెట్ కోక్ ధరలు కూడా 10 శాతం మేర తగ్గాయి. డీజిల్ ధరలు కూడా 2 శాతం మేర తగ్గి లీటరు రూ.88కి వచ్చింది. అలాగే 2025 ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో బొగ్గు 50 శాతం మేర, పెట్ కోక్ 16 శాతం, డీజిల్ 2 శాతం మేర ధరలు తగ్గడంతో ఇన్ పుట్ వ్యయాలు ఆ మేరకు తగ్గాయి. ఈ నేపథ్యంలో ధరలు తగ్గడం, డిమాండ్ పెరగడంతో సిమెంట్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.
వార్షిక ప్రాతిపదికన మార్చి నెల అమ్మకాల్లో 11 శాతం పెరుగుదల నమోదైంది. 2024 మార్చిలో సిమెంట్ అమ్మకాలు 41.7 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరాయి. మొత్తమ్మీద 2024 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం పెరుగుదలతో సిమెంట్ అమ్మకాలు 426 మెట్రిక్ టన్నులకు పెరిగాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ ఇలాగే కొనసాగి 8 నుంచి 9 శాతం పెరుగుదలతో 460-465 మెట్రిక్ టన్నుల సిమెంట్ అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.