సిటీలో ఫ్లాట్ కొనాలంటే రేటెక్కువే. కాస్త దూరం వెళ్లినా.. కొంచెం ధర తగ్గే ఛాన్స్ ఉంది. అయితే, ప్లాటు కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలని భావించేవారు.. లేదా ఓ పదేళ్ల తర్వాతనైనా అభివృద్ధి చెందుతుందనే ప్రాంతాల్లో.. ప్లాట్ల ధరలెలా ఉన్నాయనే విషయాన్ని రెజ్ న్యూస్ ఆరా తీసింది. ఈ క్రమంలో నగర శివార్లలోని పలు ప్రాంతాల్లో.. ఓపెన్ ప్లాట్ల ధరలెలా ఉన్నాయంటే..
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ నుంచి మొదలు షాద్ నగర్ వరకు ఇంటి స్థలాలు అందుబాటు ధరల్లో ఉన్నాయి. శంషాబాద్ సమీపంలోని కొత్తూరు, తిమ్మాపూర్, నందిగామ వంటి ప్రాంతాల్లో హెచ్ఎండీఏ, డీటీసీపీ లే అవుట్ లో ప్లాట్లు చదరపు గజం 15 వేల రూపాయల నుంచి 32 వేల రూపాయల మధ్య లభిస్తున్నాయి. ఇంకాస్త ముందుకు వెళ్తే షాద్ నగర్ లో సైతం భారీగా రియల్ వెంచర్లు ఉన్నాయి. అక్కడ వెంచర్ ను బట్టి చదరపు గజం హెచ్ఎండీఏ లేఅవుట్ లో 20 వేల రూపాయల నుంచి 38 వేల రూపాయల వరకు ధరలున్నాయి. షాద్ నగర్ లో డీటీసీపీ లేఅవుట్ లో 15 వేల రూపాయల నుంచి 32 వేల రూపాయల వరకు ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి.
శ్రీశైలం రహదారిపై తుక్కుగూడ, కందుకూరు, కడ్తాల్, ఆమన్ గల్ వరకు వందలాది రియల్ వెంచర్లు ఉన్నాయి. నగరానికి కాస్త దగ్గరగా ఉండటంతో తుక్కుగూడ, కందుకూరు లో డీటీసీపీ లే అవుట్ లో చదరపు గజం 20 వేల నుంచి 35 వేల వరకు ధరలున్నాయి. మహేశ్వరంలో చదరపు గజం 20 వేల నుంచి 30 వేలుండగా, మన్‌సాన్ పల్లిలో 22 వేల నుంచి 30 వేల మధ్య ధరలున్నాయి. ఆమన్ గల్ లో పదుల సంఖ్యలో రియల్ వెంచర్లను అభివృద్ధి చేసిన డెవలపర్లు చదరపు గజం 10 వేల నుంచి మొదలు 30 వేల వరకు ప్లాట్లను అమ్ముతున్నారు.
ఫోర్త్ సిటీ ప్రాంతంలోని ముచ్చర్ల, మీర్ ఖాన్ పేట ప్రాంతాల్లోను అందుబాటు ధరల్లో ఇంటి స్థలాలు లభిస్తున్నాయి. ప్రాజెక్టును బట్టి చదరపు గజం 22 వేల నుంచి 30 వేల వరకు ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడికి సమీపంలో ఇబ్రహీంపట్నంలో భారీ స్థాయిలో వెంచర్లు ఉన్నాయి. చదరపు గజం 20 వేల నుంచి 32 వేల వరకు ధరలున్నాయి. ఇటు విజయవాడ జాతీయ రహదారిపై పెద్ద అంబర్ పేట్ నుంచి మొదలు చౌటుప్పల్ వరకు పెద్ద ఎత్తున రియల్ వెంచర్లు డెవలపర్లు అభివృద్ది చేశారు. ఇక్కడ చదరపు గజం 30 నుంచి 45 వేల మధ్య ప్లాట్లు లభిస్తున్నాయి. చౌటుప్పల్ లో గజం 15 వేల నుంచి 25 వేల మధ్య ఇంటి స్థలాలు దొరుకుతున్నాయి.
పటాన్ చెరు నుంచి సంగారెడ్డి, సదాశివపేట్ వరకు వందల సంఖ్యలో రియల్ వెంచర్లు వెలిశాయి. సంగారెడ్డిలో చదరపు గజం 28 వేల నుంచి 42 వేల వరకు ధరలున్నాయి. సదాశివపేట్లో చదరపు గజం 15 వేల రూపాయల నుంచి 30 వేల మధ్యలో స్థలాలున్నాయి. షామీర్ పేట్ పరిసరాల్లోను ఓపెన్ ప్లాట్ల వెంచర్లు భారీగా ఉన్నాయి. ఇక్కడ గజం 35 వేల నుంచి 45 వేలు అంటున్నారు. మేడ్చల్ లో గజం 30 వేల నుంచి 45 వేల మధ్య ప్లాట్లు లభిస్తున్నాయి.
శంకర్ పల్లిలో మధ్యతరగతికి అందుబాటు ధరల్లో ఇంటి స్థలాలు ఉన్నాయి. ఇక్కడ డీటీసీపీ లేఅవుట్ లో చరపు గజం రూ. 35 నుంచి 45 వేల మధ్య ప్లాట్లు లభిస్తున్నాయి. మెయినాబాద్ లో హెచ్ఎండీఏ, డీటీసీపీ లేఅవుట్లలో.. చదరపు గజం 28 వేల నుంచి 40 వేలు చెబుతున్నారు. డీటీసీపీ లేఅవుట్లో గజం 22 వేల నుంచి 35 వేల మధ్య ధరలున్నాయి. ఘట్ కేసర్లో చదరపు గజం 30 వేల నుంచి 45 వేల మధ్య ప్లాట్లు లభిస్తున్నాయి. కీసరలో డీటీసీపీ లేఅవుట్లో చదరపు గజం 20 వేల నుంచి 35 వేల వరకు ధరలున్నాయి.