అమెరికా చరిత్రలో రెండో ఖరీదైన రియల్ డీల్
రియల్ ఎస్టేట్ రంగంలో ఒక్కోసారి కళ్లు చెదిరే లావాదేవీలు నమోదవుతుంటాయి. రూ.వంద కోట్లు పెట్టి ఓ ఎస్టేట్ కొంటేనే నోరెళ్లబెడతాం. అలాంటిది ఓ ప్రాపర్టీని ఏకంగా రూ.1754 కోట్లకు అమ్మారని తెలిస్తే.. ఎలా ఉంటుంది. కాలఫోర్నియాలో రికార్డు స్థాయిలో జరిగిన ఈ డీల్ రియల్ రంగంలో అందరినీ విస్తుపోయేలా చేసింది.
రియల్ ఎస్టేట్ కు ప్రత్యేకమైన మాలిబు ప్రాంతంలో ఓక్లే అనే ఐవేర్ కంపెనీ వ్యవస్థాపకుడు జేమ్స్ జన్నార్డ్ ఇటీవల తన ప్రాపర్టీని 210 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1754 కోట్లు)కు విక్రయించి రికార్డు నెలకొల్పారు. 9.5 ఎకరాల స్థలంలో ల్ పెస్కాడోర్ స్టేట్ బీచ్ ను ఆనుకుని ఉన్న స్థలంలో నిర్మించిన ఈ మాన్సన్ లో ఎనిమిది బెడ్ రూములు, 14 బాత్ రూములు, ఓ జిమ్, రెండు గెస్ట్ హౌసులు ఉన్నాయి. మైకేల్ ఎస్ స్మిత్ అనే వ్యక్తి డిజైన్ చేసిన ఈ ప్రాపర్టీ చూపు తిప్పుకోనివ్వదు. ఓర్నేట్ కాలమ్స్, ఫ్లోర్ టు సీలింగ్ విండోస్, సీ వ్యూ వంటివాటితో అదిరిపోతుంది. విశాలమైన లాన్, పెద్ద పూల్ కూడా ఉంది. కుర్ట్ రప్పాపోర్ట్ అనే సంస్థ ద్వారా ఈ లావాదేవీ జరిగింది. అమెరికా రియల్ ఎస్టేట్ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద లావాదేవీ కావడం విశేషం. గతంలో 2019లో జరిగిన 238 మిలియన్ డాలర్ల లావాదేవీ ఇప్పటివరకు అతిపెద్దది. కాగా, జన్నార్డ్ 2012లో బిలియనీర్ ఇన్వెస్టర్ హోవార్డ్ మార్క్స్ నుంచి 75 మిలియన్ డాలర్లకు ఈ ఎస్టేట్ కొనుగోలు చేశారు. అంతకుముందు హెర్బాలైఫ్ సహ వ్యవస్థాపకుడు మార్క హ్యూస్ నుంచి మార్క్స్ దీనిని 2002లో 31 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు.