Categories: TOP STORIES

ప్రీలాంచ్‌ మోసాల విలువ‌ 10 వేల కోట్లు!

  • ప్రీలాంచ్‌లో కొంటే.. ప‌రేష‌న్ త‌ప్ప‌దు
  • యూడీఎస్లో ఇల్లు కొని మోసపోవద్దంటున్న నిపుణులు
  • ఆయా ప్రాజెక్టులకు హెచ్ఎండీఏ అనుమతులు ఉండవు
  • యూడీఎస్ ప్రాజెక్టులు రెరా అథారిటీ వద్ద నమోదు కావు
  • భూ వివాదాలు తలెత్తితే స్థల యజమానిగా బాధ్యత వహించాలి
  • యూడీఎస్ పద్దతిలో ఇంటి ధర తక్కువే కానీ.. సురక్షితం కాదు

అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సర్వసాధారణంగా వినిపించే మాట. యూడీఎస్ పద్దతిలో ఫ్లాట్ల అమ్మకాలు చేయరాదని ప్రభుత్వం ఆదేశించినా.. కొందరు బిల్డర్లు పట్టించుకోవ‌ట్లేదు. తక్కువ ధరకే ఇళ్లు అని ఆశ పెట్టి.. కస్టమర్లను బుట్టలో వేసుకుంటున్నారు. చివరికి అనుమతులు రాక, సకాలంలో ఇళ్ల నిర్మాణం చేయకపోవడంతో.. కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఐదేళ్లలో ఒక్క హైదరాబాద్‌లోనే.. 10 వేల కోట్ల విలువైన రియల్ మోసాలు జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే యూడీఎస్లో ఇళ్లను కొన‌వ‌ద్ద‌ని రియల్ రంగ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

యూడీఎస్‌ పద్దతిలో విక్రయాలు చేయరాదని.. నిబంధనలను ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఓ వైపు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.. కొంతమంది డెవలపర్లు పెడచెవిన పెడుతున్నారు. హైదరాబాద్ లో సొంతిల్లు కొనాలనే సామాన్యుని కలను ఆసరా చేసుకొని.. ఇప్పటికీ యూడీఎస్ పద్దతిలో స్థలాన్ని చూపించి ఇళ్ల‌ను అమ్మేస్తున్నారు. స్థల యజమానితో ఒప్పందం చేసుకొని, అదే ఖాళీ స్థలంలో తక్కువ ధరకే అపార్ట్‌మెంట్ కడుతున్నామనడంతో.. కొనుగోలుదారులూ ముందు వెనకా ఆలోచించకుండా.. తొందరపడి కొనుగోలు చేస్తున్నారు. అవిభాజ్య స్థలం ధర తక్కువే ఉన్నా స్థలానికి సంబంధించి.. ఏమైనా న్యాయపరమైన చిక్కులొచ్చినా, నిర్మాణ అనుమతులు రాకపోయినా నష్టపోయేది కొనుగోలుదారులే. యూడీఎస్లో కొంటే కలిగే నష్టాలపై ప్రభుత్వంతో పాటు కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ చాలా సందర్బాల్లో హెచ్చరికలు జారీ చేసింది. రెరాలో నమోదైన ప్రాజెక్టులు, రెరా అనుమతి పొందిన ఏజెంట్ల నుంచి మాత్రం ఇళ్లను కొనుగోళ్లు చేయాలని సూచిస్తుంది.
యూడీఎస్ లో భాగంగా స్థల యజమాని నుంచి డెవలపర్ కేవలం అగ్రిమెంట్ మాత్రమే చేసుకుని, ఆ వెంటనే కస్ట‌మర్లకు ఇళ్లు అమ్మేస్తున్నారు. సాధారణంగా ఆ సమయంలో ఇంటి ధర చదరపు అడుగు 5 వేల రూపాయలు ఉంటే కేవలం 3వేల రూపాయలకే చదరపు అడుగు అని చెప్పి.. మొత్తం డబ్బులు 45 రోజుల నుంచి రెండు నెలల్లో వసూలు చేస్తున్నారు. చదరపు అడుగుకు ఒకేసారి రెండు వేల రూపాయలు తక్కువ రావడంతో కొనుగోలు దారులు ఎగబడి మరీ ఇళ్లను కొంటున్నారు. ఇక కనీసం రెండు నుంచి నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేసి ఇంటిని అప్పజెప్పుతామని డెవలపర్ కస్తమర్లకు చెబుతున్నారు. కానీ యూడీఎస్ ప్రాడెక్టులకు అనుమతులు రాకపోవడంతో ప్రాజెక్టులు చాలా వరకు ముందుకెళ్లడం లేదు. దీంతో డబ్బులు కట్టిన కస్టమర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో ఇంటి నిర్మాణం జరగ‌క‌, కట్టిన డబ్బులు వెనక్కి రాక ఆవేద‌న చెందుతున్నారు.
హైదరాబాద్లో సాహితీ, భువనతేజ, జేజే ఇన్ఫ్రా, జేవీ బిల్డర్స్, జయ గ్రూప్ వంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రీలాంచ్ ప్రాజెక్ట‌ల‌ను చేపట్టి కస్టమర్లను నిండా ముంచేశాయి. నార్సింగి, పుప్పాలగూడ, నానక్ రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, కొల్లూరు, నిజాంపేట, తెల్లాపూర్, శామీర్పేట, ఎల్బీనగర్, ఆదిభ‌ట్ల.. ఇలా హైదరాబాద్ నలువైపులా ఈ తరహా ప్రాజెక్టుల్లో ఇళ్ల కోసం డబ్బులు పెట్టి వేలాది మంది మోసపోయారు. హైదరారాబాద్‌లో గత ఐదేళ్లలో రియల్ ఎస్టేట్ మోసాల విలువ సుమారు రూ. 10 వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. . ఇంకా ఇలాంటి మోసపూరిత రియాల్టీ సంస్థలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయని, వాటి మాయలో పడి మోసపోవద్దని రియల్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జనవరి 2017 నుంచి 500 చదరపు మీటర్లు లేదా 6 యూనిట్ల కంటే ఎక్కువ అపార్ట్మెంట్ల నిర్మాణానికి అనుమతి పొందిన ప్రతీ ప్రాజెక్ట్ తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలను పాటించాలి. కొనుగోలుదారులు తాము కొనుగోలు చేసే ప్రాపర్టీ టీఎస్–రెరాలో నమోదైందో లేదో నిర్ధారించుకున్నాకే నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లో అధిక శాతం కొనుగోలుదారులు తొలిసారి ఇల్లు కొనుగోలు చేసే వారు ఉండగా.. వీరికి నిర్ధిష్టమైన వనరులు, రియల్టీ లావాదేవీలపై అవగాహన కాస్త తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో కొనుగోలుదారులు బిల్డర్ల ప్రొఫైల్ను పరిశీలించకుండా తక్కువ ధర అనగానే తొందరపడి కొనుగోలు చేస్తుంటారని, అలా చేయవద్దని సూచిస్తున్నారు.

This website uses cookies.