Categories: TOP STORIES

ఎన్నారైలకు ఎన్నో పెట్టుబడుల అవకాశాలు

కరోనా తర్వాత కూడా భారత రియల్ రంగం దూకుడుగా వెళ్తండటం.. ప్రపంచంలో భౌగోళిక అస్థిరత ఉన్నప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం వంటి అంశాలతో పలువురు ఎన్నారైలు భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపిస్తున్నారు. భారత రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక రాబడికి అవకాశం ఉండటంతో వారి ఆసక్తి ఇటే ఎక్కువగా ఉంది. గత కొన్నేళ్లుగా రియల్ పెట్టుబడులు అద్భుతమైన రాబడులు అందిస్తున్నాయి. పట్టణీకరణ కూడా వేగవంతం కావడంతో నాణ్యమైన హౌసింగ్, వాణిజ్య స్థలాలకు డిమాండ్ పెరిగింది. దీంతో ఎన్నారైలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారని నిపుణులు పేర్కొంటున్నారు.

భారతీయ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఎన్నారైలు తమ ఇన్వెస్ట్ మెంట్ పోర్ట్ ఫోలియోలు విభిన్నంగా మార్చుకునే వీలుంటుంది. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు తక్కువ రిస్కు కలిగి ఉంటాయి. కాలక్రమేణా ఆస్తి విలువ పెరుగుతుంది. పట్టణ కేంద్రాలు, వ్యూహాత్మక ప్రదేశాల్లో ఎంచుకున్న ప్రాపర్టీల విలువ మరింత ఎక్కువవుతుంది. అలాగే భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆకర్షణీయమైన అద్దె ఆదాయాన్ని కూడా అందిస్తుంది. వాణిజ్య స్థలాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వీటిపై అద్దె ఆదాయం గణనీయంగానే వస్తోంది. భారతీయ రియల్ ఎస్టేట్ లో ఎన్నారైలకు పెట్టుబడులకు సంబంధించి ఎన్న రకాల అవకాశాలు ఉన్నాయో చూద్దామా?

రెసిడెన్షియల్ ఆస్తులు..

అపార్ట్ మెంట్లు, విల్లాలు లేదా గేటెడ్ కమ్యూనిటీల వంటి రెసిడెన్షియల్ ప్రాపర్టీలలో పెట్టుబడి పెట్టడం వల్ల వారికి భవిష్యత్తులో స్థిరమైన దీర్ఘకాలిక పెట్టుబడులు అందిస్తుంది.

వాణిజ్య ఆస్తులు..

భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న వ్యాపార కార్యకలాపాలు వాణిజ్య ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశం కల్పిస్తున్నాయి. కార్యాలయాలు, రిటైల్ స్థలాలు, పారిశ్రామిక ఆస్తులు.. అద్దె ఆదాయం, మూలధన విలువను బాగా ఫెంపొందిస్తాయి.

భూమి..

భూమి మీద పెట్టుబడి పెట్టడం అనేది చాలా తెలివైన నిర్ణయం. ముఖ్యంగా అభివృద్ధి కోసం కేటాయించిన భూములపై పెట్టుబడులు గణనీయమైన రాబడికి హామీ ఇస్తాయి. పట్టణ విస్తరణ లేదా మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.

రీట్లు..

మరింత లిక్విడ్, వైవిధ్యపర విధానాన్ని కోరుకునే ఎన్నారైలకు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్ లు (ఆర్ఈఐటీ) మంచి ఎంపిక. ఇది పెట్టుబడిదారులను నేరుగా ఆస్తులు సొంతం చేసుకోకుండా రియల్ ఎస్టేట్ మార్కెట్లో పాల్గొనడానికి అవకాశమిస్తాయి. అయితే, ఎన్నారైలు పెట్టుబడులు పెట్టేముందు చట్టపరమైన కొన్ని అంశాల పట్ల అవగాహన కలిగి ఉండటం అవసరం. విదేశీ మారకద్రవ్య నిబంధనలు, ప్రాపర్టీ ఆర్జిషన్ విధానాలు, పన్ను చిక్కులు అర్థం చేసుకోవాలి. ఎన్నారైల పెట్టుబడులు అంతర్జాతీయ స్వభావాన్ని బట్టి కరెన్సీ హెచ్చతగ్గులు రాబడిపై ప్రభావం చూపుతాయి. అలాగే ఇక్కడి పన్ను అంశాలు కూడా క్లిష్టంగా ఉంటాయి. వీటిపై అవగాహన కోసం సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది.

This website uses cookies.