భారీ నిర్మాణాల్లో వాహనాల పార్కింగ్ కోసం సెల్లార్ల స్థానంలో స్టిల్ట్ లను చేపట్టే విధంగా అధికారులు డిజైన్ లో సవరణలను సూచిస్తున్నారు. అంటే పార్కింగ్ కోసం భూమి నుంచే నిర్మాణం చేపడతారు. ఇలా పార్కింగ్ కోసం ఎన్ని అంతస్తులైనా స్టిల్ట్ నిర్మాణాలకు అనుమతులివ్వొచ్చని మునిసిపల్ అధికారులు చెబుతున్నారు. ఆ మేరకు మొత్తం భవన నిర్మాణ ఎత్తులో వెసులుబాటు కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇటీవల ఈ తరహా నిర్మాణాలను అనుమతించినట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తు చేస్తున్నారు.
ప్రస్తుతం భారీ నిర్మాణాలు, స్కైస్క్రాపర్స్ లలో రెండు నుంచి మూడు స్టిల్టుల వరకు అనుమతిస్తున్నారు. స్టిల్ట్ ల నిర్మాణం వల్ల వేగంగా నిర్మాణం పూర్తవ్వడమే కాకుండా నిర్మాణ వ్యయం తగ్గుతుందని, ప్రమాదాలకు తావు ఉండదని అధికారులు అంటున్నారు. ఈ క్రమంలోనే సెల్లార్లకు స్వస్తి పలికి.. స్టిల్ట్ విధానానికి అనుమతి ఇచ్చేలా భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి.. మునిసిపల్ శాఖ చట్టంలో సవరణలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారం. అయితే స్టిల్ట్ నిర్మాణాలకు నివాస ప్రాజెక్టుల నిర్మాణదారుల నుంచి సానుకూలత వ్యక్తమవుతున్నా, కమర్షియల్ భవన నిర్మాణదారులు మాత్రం ఆసక్తి చూపటం లేదని మునిసిపల్ శాఖ అధికారులు చెబుతున్నారు.
వాణిజ్య నిర్మాణాల్లో గ్రౌండ్ ఫ్లోరుకు ఎక్కువగా డిమాండ్ ఉంటుందని.. ఆ స్థానంలో పార్కింగ్ సదుపాయం కల్పిస్తే నష్టపోతామన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినప్పటికీ నిర్మాణ వ్యయం, ప్రమాదాలు, నిర్మాణ సమయం, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని సెల్లార్ల నిర్మాణాల విషయంలో కఠిణమైన నిర్ణయాలు తీసుకునే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. దీనిపై త్వరలోనే నిర్మాణ సంస్థలు, బిల్డర్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ శాఖ అధికారులు చెబుతున్నారు.