కొత్తగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ ఏర్పాటు చేస్తున్నామంటూ.. పురపాలక శాఖ తాజాగా విడుదల చేసిన జీవో కొంత అస్పష్టంగా ఉంది. కోర్ హైదరాబాద్‌తో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే ప్రాంతాలన్నీ.. ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త అథారిటీ పరిధిలోకి వస్తాయని జీవోలో పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతమున్న జీహెచ్ఎంసీ విషయంలో ప్రభుత్వం ఏదైనా కొత్త ప్రతిపాదన తెరమీదికి తెచ్చే అవకాశముందా? అనే సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది.
జీహెచ్ఎంసీ పరిధిలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఇల్లు, భవనాలకు అనుమతినిస్తారు. అదేవిధంగా, హెచ్ఎండీఏ పరిధిలోనూ హెచ్ఎండీఏనే అనుమతినిస్తుంది. మరి, జీహెచ్ఎంసీ పరిధిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలోకి తెచ్చిన క్రమంలో ఇల్లు, భవనాలకు అనుమతుల్ని ఎవరిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. జీహెచ్ఎంసీ ప్రాంతాల గురించి కొత్త జీవో గురించి ప్రత్యేకంగా పేర్కొనకపోతే.. ఎవరికీ ఎలాంటి సందేహం వచ్చేది కాదు. కాకపోతే, కోర్ హైదరాబాద్, జీహెచ్ఎంసీ ప్రాంతాల్ని కొత్త మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలోకి రావడంతోనే కొత్త సందేహాలు పుట్టుకొస్తున్నాయి. పోనీ, జీవోలో ఇలాంటి విషయాలపై కాస్త స్పష్టత ఇస్తే.. ఎలాంటి సమస్యే ఉండేది కాదు.