- నగరంలో 40 ఏళ్లకు సరిపడా నీరుంది
- వాటర్ బోర్డు ఎండీ దానకిశోర్ వెల్లడి
హైదరాబాద్ లో నీటికి ఎలాంటి కొరతా లేదని, నగరంలో 40 ఏళ్లకు సరిపడా నీరుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజీ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్ తెలిపారు. తెలంగాణ ఇన్ ఫ్రా సమ్మిట్ లో ‘ఫిజికల్ ఇన్ ఫ్రాస్టక్చర్ అండ్ రియల్టీ – అవకాశాలు, సవాళ్లు‘ అనే అంశంపై సీఐఐ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.
ఆక్స్ ఫర్డ్ సిటీస్ నివేదిక ప్రకారం, 2030 నాటికి ప్రపంచంలో అగ్రగామిగా అభివృద్ధి చెందుతునన 20 నగరాల్లో 17 నగరాలు భారతదేశంలోనివే ఉండొచ్చని.. హైదరాబాద్ 85 బిలియన్ డాలర్ల జీడీపీ కలిగి ఉండొచ్చని పేర్కొన్నారు. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం, ఔటర్ రింగు రోడ్డు, నీటి ప్రాజెక్టులు, మెట్రో రైలు వంటి మెరుగైన మౌలిక సదుపాయాల పరంగా రోల్ మోడల్ రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని సీఐఐ తెలంగాణ ఇన్ ఫ్రా అండ్ రియల్ ఎస్టేట్ ప్యానెల్ అండ్ ఎండీ ఎం. గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.
రోడ్ల నిర్మాణంలో భూసేకరణ అనేది తీవ్రమైన సమస్య అని.. ఈ విషయంలో అధిక వ్యయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అలాగే వీటికి సంబంధించిన వివాదాలను 90 రోజుల్లో పరిష్కరించాలని సూచించారు. ప్రజలంతా నీటిని పొదుపు చేసే సాధనాలను వినియోగించేలా ప్రోత్సహించాలని సీఐఐ తెలంగాణ వైస్ చైర్మన్ సి.శేఖర్ రెడ్డి పేర్కొన్నారు.