రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డర్-బయ్యర్ మోడల్ అగ్రిమెంట్ ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వినియోగదారుల ప్రయోజనాలు కాపాడేందుకు ఇది ఉపకరిస్తుందని పేర్కొంది. విస్తృత ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉన్న ఈ అంశపై నవంబర్ 22లోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ‘ప్రజాప్రయోజనాల కోణంలో ఇది చాలా ముఖ్యమైన విషయం. రెరా కింద మోడల్ బిల్డర్-బయ్యర్ అగ్రిమెంట్ రూపొందించడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది.
అందువల్ల ఈ విషయంలో నవంబర్ 22లోగా మీ సమాధానం ఏమిటో తెలియజేయండి’ అని అందులో పేర్కొన్నారు. డెవలపర్లు సామాన్యులకు తెలియని రకరకాల క్లాజులు వారు చేసుకునే ఒప్పందాల్లో చేర్చే అవకాశం ఉన్నందున.. కొనుగోలుదారులు నష్టపోకుండా ఉండేందుకు బిల్డర్-బయ్యర్ మోడల్ అగ్రిమెంటును రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. కొనుగోలుదారుల ప్రయోజనాలు కాపాడేందుకు, రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత కోసం మోడల్ అగ్రిమెంటు రూపొందించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలంటూ అశ్వినీ ఉపాధ్యాయ అనే లాయర్ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రాల్లో ఉన్న మోడల్ అగ్రిమెంట్లను బిల్డర్లు ప్రభావితం చేసే పరిస్థితి ఉందని.. పైగా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో తీరుగా నిబంధనలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒకేవిధమైన మోడల్ అగ్రిమెంట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
This website uses cookies.