ఫైర్ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న భవనాల యజమానులపై జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (జేఎంసీ) చర్యలకు ఉపక్రమించింది. ఫైర్ ఎన్ఓసీ తీసుకోకుండా నడుస్తున్న మూడు వాణిజ్య భవనాలను సీజ్ చేసింది. అజ్మర్ రోడ్డులోని ఓకే టవర్, కలెక్టరేట్ సర్కిల్ లోని ఓ రెస్టారెంట్, విశాల్ మెగా మార్ట్ ఉన్న భవనాలకు తాళాలు వేసింది. ఫైర్ ఎన్ఓసీ తీసుకోనందుకు ముందుగా నోటీసులు జారీ చేసి అనంతరం ఆ భవనాలకు సీల్ వేసింది.
వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ భవనాలకు ఫైర్ ఎన్ఓసీ లేదని, ఇలాంటి భవనాలు ఇంకా చాలా ఉన్నాయని, వాటిపై కూడా చర్యలు తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు. జైపూర్ లో దాదాపు 2వేలకు పైగా కమర్షియల్ ప్రాపర్టీలకు ఫైర్ ఎన్ఓసీ లేదని జేఎంసీ హెరిటేజ్ విభాగం గుర్తించింది. దీనిపై గతంలో చాలాసార్లు ఆయా భవనాల యజమానులను హెచ్చరించినప్పటికీ వారు ఎన్ ఓసీ తీసుకోలేదు. దీంతో జేఎంసీ చర్యలు చేపట్టింది. తాము ఇప్పటికే 600కి పైగా భవనాలకు నోటీసులు జారీ చేశామని, అలాగే ఫైర్ ఎన్ఓసీ ప్రాముఖ్యతపై కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని ఓ అధికారి వెల్లడించారు.
భవన యజమానులందరూ ఫైర్ ఎన్ఓసీ కోసం డబ్బులు డిపాజిట్ చేస్తే.. కార్పొరేషన్ కు దాదాపు రూ.50 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా. కాగా, హైదరాబాద్ లో ఎన్నో ఆకాశ హర్మ్యాలు, బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. మరి వాటిలో ఎన్ని భవనాలకు ఫైర్ ఎన్ ఓసీ ఉంది? అసలు అధికారులు వాటిని ఎప్పుడైనా తనిఖీ చేస్తున్నారా? అన్నది తేలాల్సి ఉంది. ఏదైనా సంఘటన జరిగిన తర్వాత బాధపడే కంటే ముందుగానే అది జరగకుండా చూసుకోవడం ఉత్తమం కదా అని పలువురు అంటున్నారు.
This website uses cookies.