ట్రిపుల్ వన్ జీవోను మంత్రిమండలి ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది. అయితే, ఈ ప్రాంతాన్ని కాంక్రీటు జంగిల్లా కాకుండా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలి.
భారతదేశంలోనే లక్షకు పైగా ఎకరాల్లో ఇంత అందంగా ఏ ప్రాంతమూ కనిపించదు. ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్యలో.. ట్విన్ రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండటం, ఇది అత్యంత అద్భుతమైన పచ్చటి నగరంగా కనిపిస్తుంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ల నుంచి నీళ్లను లిఫ్ట్ చేసి.. 111 జీవో పరిధిలో ఉన్న చెరువులు, కుంటల్ని ఏడాదికి రెండుసార్లు పైపుల ద్వారా నింపాలి. దీంతో ఇక్కడి భూగర్భజలాలు పెరుగుతాయి. తద్వారా పెద్దపెద్ద చెట్లు పెరుగుతాయి. అవి పెద్దగా అయితే, పది రెట్లు గ్రీనరీ పెరుగుతుంది.
84 గ్రామాల్ని 111 జీవో పరిధిలోకి తెచ్చినా.. అనేక ఇంజినీరింగ్ కళాశాలలు, మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు, లేఅవుట్లు వెలిశాయి. అంటే, అక్రమ నిర్మాణాల్ని నిరోధించడంలో ఇప్పటివరకూ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఈ ప్రాంతాన్ని హరితమయం చేసి పరిరక్షిస్తూనే సరికొత్త రీతిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. 111 జీవో వల్ల ఇక్కడి రైతులకు కొన్నేళ్ల నుంచి తీరని అన్యాయం జరిగింది. పక్కనే ఉన్న కోకాపేట్‌లో ఎకరం నలభై కోట్లు ఉంటే.. ఇక్కడి ప్రాంతాల్లో కనీసం నాలుగు కోట్లను మించట్లేదు. ఈ అసమానతల్ని తొలగించేందుకై రాష్ట్ర ప్రభుత్వం 111 జీవోను ఎత్తేసిందని అనిపిస్తోంది. 111 జీవోను తొలగించాక అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో రేట్లు పెరుగుతాయి. మిగతా ఏరియాల్లో భూముల ధరలు తగ్గొచ్చు.
– గుమ్మి రాంరెడ్డి, వైస్ ప్రెసిడెంట్, క్రెడాయ్ నేషనల్
This website uses cookies.