Categories: LEGAL

క్యాన్సర్ లా మారిన ధరణి

ప్రముఖ న్యాయవాది పీఎస్ఎన్ ప్రసాద్

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వెబ్ సైట్ క్యాన్సర్ లా మారిందని.. ప్రభుత్వం కూడా ఆ సమస్యలు పరిష్కరించే స్థితిలో లేదు. ధరణి వల్ల రిజిస్ట్రేషన్లు చకచకా జరిగిపోతున్నాయని, గతంలో ఉన్న ఇబ్బందులు లేవని ప్రభుత్వం చెబుతోందని.. కానీ అలాంటి పరిస్థితి లేదు. ధరణిలో పేర్లు ఉన్నవారి వరకు రిజిస్ట్రేషన్లు అవుతుండొచ్చు గానీ.. ధరణిలో పేర్లు లేనివారి పరిస్థితి ఏమిటి?

గతంలో ఆ భూములు అమ్మేసినప్పటికీ, ధరణిలో వారి పేర్లే ఉండటంతో.. వారిలో కొందరు మళ్లీ అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధరణిలో పేర్లు లేనివారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 1971 చట్టం ఎంతో కాలంగా ఉంది. దానికి చిన్న చిన్న సవరణలు చేశారు. కొత్త రాష్ట్రం వచ్చాక దానిని మెరుగు చేస్తే సరిపోయేది. కానీ దానిని పక్కనపెట్టి ధరణి తీసుకొచ్చారు. ఇందులో ఏదైనా సమస్య వస్తే ఎవరికి ఎలా చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. సమస్యల పరిష్కారం పూర్తిగా అధికారుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉంది. దీంతో కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. అన్నీ పరిశీలించిన హైకోర్టు.. వేలాది మందికి వ్యతిరేకంగా అధికారులు తీసుకొచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఆయా సమస్యలను మళ్లీ పరిష్కరించాలని సూచిచింది. కానీ అధికారులు వాటిని పట్టించుకోకపోవడంతో వేలాది కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయి. దీంతో భూపరిపాలన శాఖ కమిషనర్ ను పిలిపించి హైకోర్టు తగిన సూచనలు చేసింది.

ప్రతి మండల ఆఫీసులో, ప్రతి కలెక్టర్ ఆఫీసులో వందలాది మంది బ్రోకర్లు తయారయ్యారు. ధరణి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఇదంతా రాజ్యాంగ, చట్ట విరుద్ధం. ఈ నేపథ్యంలో 1971 చట్టంలోని మంచి అంశాలను తీసుకుని, అందులో జనాలకు నష్టం కలిగించే వాటిని పక్కకుపెట్టి.. అందరి సూచనలూ, సలహాలూ తీసుకుని ఆ చట్టాన్ని మార్చ‌వ‌చ్చు. ఇలాంటి కసరత్తు ఏమీ లేకుండా తీసుకొచ్చిన చట్టమే ధరణి. ధరణిలో కూడా భౌతికంగా దరఖాస్తు ఇచ్చే వెసులుబాటు ఉండాలి. దరఖాస్తు ఎందుకు తిరస్కరించారో కూడా అధికారులు చెప్పే పరిస్థితి ఉండాలి. తప్పు చేసిన అధికారులపై కూడా చర్య తీసుకోలేకుండా వారికి రక్షణ చట్టంగా ధరణి తీసుకొచ్చారు. గత చట్టంతో లేని సమస్యలే కాకుండా బోలెడు కొత్త సమస్యలను ధరణి తీసుకొచ్చింది.

This website uses cookies.