దేశంలో ద్వితీయ శ్రేణి (టైర్-2), తృతీయ శ్రేణి (టైర్-3) దూసుకెళ్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ఓవైపు పెరుగుతున్న పట్టణ జనాభా, మరోవైపు అక్కడ చుక్కలనంటుతున్న భూముల ధరలు.. చాలామందిని టైర్-2 నగరాల వైపు దృష్టి సారించేలా చేస్తున్నాయి. పైగా టైర్-2, 3 నగరాలు, పట్టణాల్లో భూముల ధరలు తక్కువగా ఉండటమే కాకుండా మౌలిక వసతుల అభివృద్ధి కూడా బాగుండటంతో డెవలపర్లు కూడా అటు వైపు వెళుతున్నారు. అదే సమయంలో ఐటీ ఉద్యోగులకు హైబ్రిడ్ పని విధానం ఉండటంతో చాలామంది తమ ఊళ్లకు దగ్గరగా ఉంటే టైర్-2 నగరాల్లో ప్రాపర్టీ కొనుగోలుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.
ఫలితంగా ఇక్కడ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు బాగా ఊపందుకున్నాయి. స్మార్ట్ సిటీ మిషన్, పీఎంఏవై, అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ ఫర్మేషన్ (అమృత్) వంటి ప్రభుత్వ కార్యకలాపాలు టైర్-2 నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. రోడ్లు, హైవేలు, ప్రజా రవాణా, ప్రాంతీయ విమానాశ్రయాలలో కూడా పెట్టుబడులు భారీగా ఉన్నాయి. ఇవన్నీ ఈ నగరాల్లో కనెక్టివిటీని మెరుగుపరచడంతోపాటు సమీపంలోని పెద్ద నగరాలకు అనుసంధానాన్ని సులభతరం చేస్తాయి. దీంతో టైర్-2 నగరాలకు డిమాండ్ పెరుగుతోంది.
ప్రాపర్టీ పెట్టుబడిదారుల్లో 26 శాతం మంది టైర్-2, 3 నగరాల వైపు మొగ్గు చూపిస్తున్నారని అనరాక్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే వెల్లడించింది. కొనుగోలుదారుల జీవనశైలి మారుతున్నందున లగ్జరీ సౌకర్యాలు తక్కువగా లభించే టైర్-2 నగరాల వైపు ఎక్కువ మంది మళ్లుతున్నారు. రద్దీగా ఉండే మెట్రోల వెలుపల నాణ్యమైన జీవితాన్ని కోరుకునే సంపన్న కొనుగోలుదారులకు ఇవి చక్కటి చాయిస్ గా మారాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో టాప్ 30 టైర్ 2 నగరాల్లో ఇళ్ల విక్రయాలు 11 శాతం పెరిగి దాదాపు 2.08 లక్షల యూనిట్లకు చేరుకున్నట్టు ప్రాప్‌ఈక్విటీ నివేదిక వెల్లడించింది.
This website uses cookies.