కింగ్ జాన్సన్ కొయ్యడ: హైదరాబాద్ రియల్ రంగం మీద పడి దోచుకుంటున్న కొందరు అక్రమార్కుల్ని దారిలోకి తెచ్చే ప్రయత్నానికి నిర్మాణ సంఘాలు శ్రీకారం చుట్టాయి. అదిగో ఫ్లాటు అంటూ ఖాళీ స్థలాల్ని చూపిస్తూ అమ్మేస్తున్న వారికి అల్టీమేటం ఇచ్చేందుకు నిర్ణయించాయి. ఇప్పుడు కొంటే ధర తక్కువ అని చెబుతూ సొమ్ము లాగేసే అక్రమార్కులకు బుద్ధి చెప్పేందుకు నడుం బిగించాయి. గత రెండేళ్లుగా యూడీఎస్, ప్రీలాంచ్ అక్రమాలు జరుగుతున్నా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్న దాఖలాల్లేవు. ఏదో తూతూమంత్రంగా ఒకట్రెండు సర్క్యులర్లు ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారంతే. సాటి డెవలపర్ల నుంచి ఒత్తిడి వచ్చిందో.. అమాయకులు బలి అవుతున్నారని తెలుసుకున్నారో తెలియదు కానీ, తెలంగాణ నిర్మాణ సంఘాల్లో ఎట్టకేలకు చలనం వచ్చింది. యూడీఎస్, ప్రీలాంచ్ అమ్మకాల్ని ఎలాగైనా నిరోధించాలని తీర్మానించాయి.
క్రెడాయ్ హైదరాబాద్, ట్రెడా, టీబీఎఫ్, టీడీఏ వంటి నిర్మాణ సంఘాలు యూడీఎస్, ప్రీ లాంచ్ అమ్మకాల్ని అరికట్టేందుకు కంకణం కట్టుకున్నాయి. ఎలాగైనా వీటికి చరమగీతం పాడకపోతే తెలంగాణ నిర్మాణ రంగం నిర్వీర్యమవుతుందని భావించాయి. అందుకే, అన్నీ కలిసికట్టుగా యూడీఎస్, ప్రీలాంచ్ అమ్మకాలను నిరోధించేందుకు కలిసికట్టుగా అడుగులు ముందుకేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఒకట్రెండు సమావేశాలు జరిగినట్లు సమాచారం. ప్రతి సంఘం తమ సభ్యులకు యూడీఎస్, ప్రీలాంచ్ అమ్మకాలు చేయవద్దని తొలుత సమాచారం అందజేస్తారు. ఎట్టి పరిస్థితిల్లో వీటిని విక్రయించకూడదని గట్టిగా చెప్పాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా పలు సంఘాలు తమ డెవలపర్లకు వివరించే పనిలో నిమగ్నమయ్యాయి.
యూడీఎస్, ప్రీలాంచ్‌లో అమ్మకాలు చేయవద్దని.. ప్రతి నిర్మాణ సంఘం తొలుత తమ సభ్యులకు సమాచారం అందజేస్తుంది. ఎవరైనా చెప్పినా వినకపోతే, వారిని సంఘం నుంచి బహిష్కరించాలని పలు సంస్థలు ఆలోచిస్తున్నాయి. నిజానికి, ఒక సంస్థను సంఘం నుంచి బహిష్కరిస్తే.. మార్కెట్లో ఆయా సంస్థకు ఎక్కడ్లేని అప్రతిష్ఠ ఏర్పడుతుంది. దీంతో, ఏ సంస్థ యూడీఎస్, ప్రీలాంచ్ సేల్ చేసే ఆలోచనను విరమించుకుంటాయని నిర్మాణ సంఘాలు భావిస్తున్నాయి. తమ సంఘంలోని లేని సభ్యులు ఇలాంటి స్కీముల్ని ప్రకటిస్తే.. తామేం చేయలేమని పలు సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. కాకపోతే, ఇలాంటి సాహసం నిర్మాణ సంఘాలు చేస్తాయా? అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితిలో ఇలాంటి కఠినమైన నిర్ణయాల్ని తీసుకోకపోతే, తెలంగాణ నిర్మాణ రంగమే నిర్వర్యమవుతుందని నిర్మాణ సంఘాలు ముక్తకంఠంతో చెబుతున్నాయి.
యూడీఎస్, ప్రీలాంచ్ అమ్మకాల్ని అరికట్టడంలో నిర్మాణ సంఘాలు కీలక భూమికను పోషించాలని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, ప్రజల్నుంచి సొమ్మును లాగేస్తున్న సంస్థల వివరాలు నిర్మాణ సంఘాలకు తెలిసే జరుగుతున్నాయని అంటున్నారు. కొందరు చేసే ఇలాంటి అక్రమ వ్యవహారాల వల్ల మొత్తం రంగానికే నష్టం వాటిల్లే ప్రమాదముందని, అందుకే ఆయా సంఘాలు వారిని అరికట్టే ప్రయత్నం చేయాలన్నారు. యూడీఎస్, ప్రీలాంచ్ అమ్మకాల్ని నిరోధించే బాధ్యత.. ఆయా సంస్థల మీద కఠిన చర్యల్ని తీసుకునే బాధ్యత తెలంగాణ రెరా అథారిటీ మీదే ఉంటుందని నిర్మాణ సంఘాలు చెబుతున్నాయి. ఏదీఏమైనా, ప్రీలాంచ్ అమ్మకాలు తగ్గి.. సాధారణ అమ్మకాలు పెరిగినప్పుడే మార్కెట్ సస్యశామలంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
This website uses cookies.