నవీన్ చంద్ర.. అందాల రాక్షసి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న నటుడు. తమిళ చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించడాని కంటే ముందే తన నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం పొందాడు. కర్ణాటకలోని బళ్లారిలో ఒక తెలుగు కుటుంబంలో జన్మించిన నవీన్ చంద్ర.. 2005లో ‘సంభవామి యుగే యుగే’ అనే తెలుగు సినిమాతో ఆరగేట్రం చేశాడు. అనంతరం కళ్యాణం అనే సినిమాలో నటించాడు. తర్వాత అగరతి అనే తమిళ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. కానీ బాక్సాఫీసు వద్ద ఆ చిత్రం ఫెయిల్ కావడంతో కెరీర్ ఒడుదొడుకుల్లో పడింది. 2012లో నవీన్ నటించిన అందాల రాక్షసి సినిమా హిట్ కావడంతో మళ్లీ వెనుతిరిగి చూడలేదు. అప్పటినుంచి పలు వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకులను రంజింపచేస్తున్నాడు. తాజాగా బ్రో చిత్రంలో నటించిన నవీన్ ను రియల్ ఎస్టేట్ గురు పలకరించింది. ఈ సందర్భంగా తన కలల గృహం ఎలా ఉండాలనే అంశాలను ఆయన పంచుకున్నారు.
బళ్లారి వంటి ప్రాంతం నుంచి వచ్చిన నేపథ్యమో ఏమోగానీ తాను సాధ్యమైనంత వరకు ప్రకృతితో మమేకం కావాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ఎలాంటి విలాసాలు, ఆర్భాటాలు లేకుండా తన ఇల్లు పర్యావరణహితంగా ఉండాలని స్పష్టంచేశాడు. పచ్చని చెట్ల మధ్య చిన్న ఇల్లు చాలన్నాడు. ‘నాకు పెద్ద ఇల్లు అక్కర్లేదు. కానీ నా ఇంటి చుట్టూ మొక్కలు, చెట్లు, ఎక్కువ పచ్చదనం కావాలి. ప్రకృతి నుంచి వచ్చేది ఏదైనా సరే ఎక్కువగా ఉండాలి. విలాసవంతమైన ఇంటిని నిర్మించుకోవడం కంటే ప్రకృతికే ఎక్కువ స్థలం ఇవ్వాలనేదే నా అభిప్రాయం’ అని వెల్లడించాడు. తన మనసు సంతోషంగా ఉండే ప్రదేశంలో ఇల్లు కట్టుకోవాలని భావిస్తున్నట్టు చెప్పాడు. ‘నా మనసు సంతోషంగా ఉండేచోట ఏదైనా కట్టుకోవాలని అనుకుంటున్నాను. దీనికి సంబంధించి నాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. కానీ ఇంటీరియర్స్ విషయానికి వస్తే నా దగ్గర ఎలాంటి ప్లాన్లూ లేవు. నా ఇంట్లో మీరు మొక్కలు మాత్రమే చూస్తారు. ఇంట్లో ఉండే ప్రతి వస్తువూ పర్యావరణ అనుకూలమైనదే అయి ఉంటుంది’ అని వివరించాడు. తన ఇంటి విస్తీర్ణం కంటే చుట్టూ పచ్చదనమే ఎక్కువగా ఉంటుందని ఉద్ఘాటించాడు.
‘నేను దేశంలోని అనేక దక్షిణాది ప్రాంతాల్లో ఉంటూ పెరిగిన పాత స్కూలు పిల్లాడిని. నాకు దక్షిణాది సంస్కృతి తెలుసు. అంతేకాకుండా ఆధ్యాత్మిక, పలు రకాల భావోద్వేగాలతో పెరిగాను. ఈ నేపథ్యంలో ఇవన్నీ ప్రతిబింబించేలా ఏదైనా కట్టుకోవాలన్నదే నా కోరిక. అక్కడ నా శరీరానికి కాకుండా నా మనసుకు విశ్రాంతి లభిస్తుంది. కొంత ఆధ్యాత్మికం, మరికొంత ప్రకృతికి దగ్గరగా నా ఇల్లు ఉంటుంది’ అని నవీన్ తెలిపాడు. శరవేగంగా పెరుగుతున్న కాంక్రీట్ జంగిల్ ను చూస్తే ప్రకృతికి దగ్గరగా ఇల్లు కట్టుకోవడం అనేది చాలా కష్టం. నవీన్ కు కూడా ఈ విషయం బోధపడింది. అందుకే అతడి కలల ఇంటి నిర్మాణం వాయిదా పడింది. మరి ఈ నేపథ్యంలో మీ అభిరుచికి తగినట్టుగా ప్రకృతికి దగ్గరగా ఇల్లు ఎక్కడ కట్టుకుంటారని అడగ్గా.. ‘ప్రస్తుతానికి నా ప్రణాళికను వాయిదా వేయాలి. ఈ కాంక్రీటుకు దూరంగా ఏదైనా నిర్మించాలి. పెరుగుతున్న కాంక్రీట్ జంగిల్ నుంచి సమయం వచ్చినప్పుడు బయటపడాలి. కానీ ఎక్కడైనా సరే ప్రకృతికి దగ్గరగానే ఉంటాను. మనం ఒక్కసారి మాత్రమే జీవిస్తాము. ఆ ఒక్కసారీ ప్రకృతితోనే మమేకమై జీవించాలన్నదే నా కోరిక’ అని నవీన్ బదులిచ్చాడు. కాగా, వరుణ్ తేజ్ నటించిన బాక్సింగ్ నేపథ్యం సినిమా ఘనిలో నవీన్ కనిపిస్తాడు. అలాగే రాణా దగ్గుబాటి, సాయిపల్లవి నటిస్తున్న విరాటపర్వం సినిమాలో కూడా నవీన్ చంద్ర కీలక పాత్ర పోషించాడు.
This website uses cookies.