- బిల్డర్ కి రెరా ఆదేశం
ఓ ప్రాజెక్టుకు సంబంధించిన రూ.62.26 లక్షల కార్పస్ ఫండ్ ను సంబంధిత రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ బదిలీ చేయాలని సదరు బిల్డర్ ను రెరా ఆదేశించింది. ఈ మేరకు బెంగళూరు సమీపంలోని సీనియర్ లివింగ్ ప్రాజెక్టు డెవలపర్ కు కర్ణాటక రెరా ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరు మాండ్యకు సమీపంలో ఉన్న సీనియర్ లివింగ్ టౌన్ షిప్ శారదిందు స్టేట్-3 ప్రాజెక్టును శ్రీ సీనియర్ హోమ్స్ అభివృద్ది చేస్తోంది. ప్రాజెక్టు తొలి రెండు దశలు పూర్తయిన తర్వాత 2016 నుంచి 2022లో అసోసియేషన్ ఏర్పడే వరకు బిల్డరే మెయింటనెన్స్ సేవలు అందించారు.
ఇందుకోసం ప్రతి చదరపు అడుగుకు రూ.4.5 వసూలు చేశారు. అలాగే 2015 నుంచి 2022 వరకు పెట్టిన ఖర్చుల్లో 35 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పైగా కార్పస్ ఫండ్ ను సొసైటీకి బదిలీ చేయలేదు. ఈ వివరాలతో సదరు సొసైటీ రెరాను ఆశ్రయించింది. అయితే, ప్రాజెక్టు తొలి దశ రెరా చట్టం అమల్లోకి రాకముందే పూర్తయినందున అది రెరా పరిధిలోకి రాదని.. ప్రాజెక్టు మూడో దశ మాత్రమే రెరా పరిధిలోకి వస్తుందని డెవలపర్ వాదించారు. కేసు వివరాలను పరిశీలించిన రెరా.. ఈ ప్రాజెక్టును దశలవారీగా అభివృద్ధి చెందుతున్న ప్రాజెక్టుగా కాకుండా కొనసాగుతున్న ప్రాజెక్టుగా నిర్ధారించింది.
2012లో తీసుకున్న మాస్టర్ ప్లాన్, ఇతర పత్రాల్లో దశలవారీగా అభివృద్ధి చేయాల్సిన యూనిట్లు నిర్వచించలేదని.. సాధారణ ప్రాంతాల్లో అవిభాజ్య వాటాను అసోసియేషన్ కు తెలియ చేయలేదని. అందువల్ల ఈ ప్రాజెక్టును కొనసాగుతున్న ప్రాజెక్టుగా పరిగణిస్తామని రెరా స్పష్టం చేసింది. పైగా ఇంటర్ కామ్, స్విమింగ్ పూల్, సీనియర్ లివింగ్ హాబీ రూమ్ వంటి అనేక సౌకర్యాలు కల్పించలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో కార్పస్ ఫండ్ ను తాము ఆర్డర్ ఇచ్చిన 60 రోజుల్లోగా అసోసియేషన్ కు బదిలీ చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా పెండింగ్ లో ఉన్న సౌకర్యాల కల్పనను రెండు నెలల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది.