Categories: TOP STORIES

హైద‌రాబాద్‌లోకి ట్రంప్ ట‌వ‌ర్స్‌!

  • మాదాపూర్‌లోని ఖానామెట్‌లో
  • 2.9 ఎక‌రాల్లో 27 అంత‌స్తులు

హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ రంగానికి శుభ‌వార్త‌.. అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చెందిన ట్రంప్ ట‌వ‌ర్స్.. హైద‌రాబాద్ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. హైద‌రాబాద్‌లోనే హాట్ లొకేష‌న్ అయిన‌ హైటెక్ సిటీలో.. అల్ట్రా ల‌గ్జ‌రీ అపార్టుమెంట్ల‌ను నిర్మిస్తోంది. హెచ్ఎండీఏ వేలం వేసిన ఖానామెట్‌లో 2.92 ఎక‌రాల్ని సొంతం చేసుకున్న మంజీరా గ్రూప్‌తో ట్రంప్ ట‌వ‌ర్స్ జ‌త క‌ట్టింది. మాదాపూర్‌లో 27 అంత‌స్తుల ఎత్తులో ఆకాశ‌హ‌ర్మ్యాన్ని నిర్మిస్తోంది. పైగా, ఈ జంట ట‌వ‌ర్ల‌కు ఫైర్ ఎన్వోసీ కూడా ల‌భించింద‌ని తెలిసింది.

ట్రంప్ ట‌వ‌ర్స్ ఫ్లాట్ల సైజుల విష‌యానికి వ‌స్తే.. ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ నాలుగు వేల నుంచి ఐదు వేల చ‌దర‌పు అడుగుల విస్తీర్ణంలో ప్లాన్ చేశారు. అదే, ఐదు బెడ్రూమ్‌ల ఫ్లాట్లు అయితే ఆరు వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో క‌డ‌తారు. డిసెంబ‌రు 2022లో అనుమ‌తుల‌న్నీ వచ్చాక నిర్మాణ ప‌నుల్ని మొద‌లుపెట్టి మూడున్న‌రేళ్ల‌లో ప్రాజెక్టును పూర్తి చేయాల‌ని మంజీరా గ్రూప్ ప్ర‌ణాళిక‌ల్ని ర‌చించింద‌ని స‌మాచారం. ఇందులో ఫ్లాట్ కొనాలంటే.. చ‌ద‌ర‌పు అడుక్కీ ఎంత‌లేద‌న్నా ప‌ద‌మూడు వేల దాకా ఉంటుంద‌ని స‌మాచారం. అంటే, నాలుగు వేల చ‌ద‌ర‌పు అడుగుల ఫ్లాట్ కోసం క‌నీసం ఐదున్న‌ర కోట్ల దాకా పెట్టాల్సి ఉంటుంది. రెరా అనుమ‌తి ల‌భించాకే ఈ ప్రాజెక్టును అట్ట‌హాసంగా ఆరంభించేందుకు సంస్థ ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తుంద‌ని తెలిసింది. ట్రంప్ ట‌వ‌ర్స్ ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ప్రైవేటు ఎలివేట‌ర్లు ఉంటాయి. డ‌బుల్ హైట్‌లో లివింగ్ స్పేసెస్‌, బాల్క‌నీలు, రెండు ట‌వ‌ర్ల‌ను క‌లుపుతూ రూఫ్ టాప్ క్ల‌బ్ హౌజులుంటాయి. ఇప్ప‌టివ‌ర‌కూ కోల్‌క‌తా, ఢిల్లీ, ముంబై, పుణె వంటి న‌గ‌రాల్లో అడుగుపెట్టిన ట్రంప్ ట‌వ‌ర్స్.. హైద‌రాబాద్‌లోకి అడుగుపెట్ట‌డం కొనుగోలుదారుల‌కు పండ‌గే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక అంత‌ర్జాతీయ సంస్థ‌కు చెందిన బ్రాండెడ్ అపార్టుమెంట్లలో నివ‌సించ‌డ‌మంటే మాట‌లు కాదు క‌దా!

This website uses cookies.