అసలే దీపావళి పండగ.. సొంతిల్లు కొనుక్కోవాలనే ఆత్రుత చాలామందికి ఉంటుంది. ఈ అంశాన్ని గ్రహించిన నిర్మాణ సంఘాలు.. బయ్యర్లను ఆకట్టుకోవడానికి ప్రాపర్టీ షోలను నిర్వహిస్తున్నాయి. రెండు వారాల క్రితమే నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో జరిగిన విషయం తెలిసిందే. అదే వారంలో క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షోను నిర్వహించింది. తాజాగా.. క్రెడాయ్ హైదరాబాద్, క్రెడాయ్ వరంగల్, క్రెడాయ్ రాజమహేంద్రవరం వంటి సంఘాలు స్థిరాస్తి ప్రదర్శనను ఘనంగా నిర్వహిస్తున్నాయి. మరి, రియల్ మార్కెట్ ప్రతికూలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలుదారుల నుంచి ఈ ప్రదర్శనలకు అపూర్వ స్పందన రావాలని నిర్మాణ సంఘాలు ఆశిస్తున్నాయి.
పండగ వెలుగుజిలుగుల్లో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాలని బయ్యర్లు ఆశించడం సహజమే. అందుకే, దీపావళి పండగ సమయంలోనే చాలామంది ఫ్లాట్లను బుక్ చేస్తారు. ఇలాంటి వారికోసమే క్రెడాయ్ సంఘం.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా ప్రాపర్టీ షోలను నిర్వహించడానికి ప్రణాళికల్ని రచించింది. ఈ క్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ నవంబరు 5,6 తేదీల్లో నార్త్ హైదరాబాద్‌లో ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది. వచ్చే నెల ఆరో తేదీన రాజమండ్రిలోని సీవీ సుబ్బలక్ష్మీ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నామని క్రెడాయ్ రాజమహేంద్రవరం ఛైర్మన్ సురావరపు శ్రీనివాస్ కుమార్ తెలిపారు. ఈ మూడు రోజుల ప్రదర్శనలో సుమారు 90 స్టాళ్లను ఏర్పాటు చేస్తామని.. బ్యాంకులు, నిర్మాణ సామగ్రి, నిర్మాణ సంస్థలు ఇందులో పాల్గొంటాయని వెల్లడించారు. కొవిడ్ కారణంగా 2019 తర్వాత నగరంలో ప్రాపర్టీ షోను నిర్వహించలేదని.. కాబట్టి, ఈ ప్రదర్శనకు భారీ స్పందన లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
క్రెడాయ్ వరంగల్ రెండో ఎడిషన్ ప్రాపర్టీ షోను నేడు, రేపు నిర్వహిస్తున్నాయి. హన్మకొండలోని హంటర్ రోడ్డులో గల విష్ణుప్రియ గార్డెన్స్‌లో జరిగే ఈ షోలో సుమారు 98 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. రెండు రోజుల ప్రదర్శనకు సుమారు పాతిక వేల మందికిపైగా సందర్శకులు విచ్చేస్తారని అంచనా. అక్టోబరు 13 నుంచి 16 దాకా క్రెడాయ్ ఎంసీహెచ్ఐ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని ఎంఎంఆర్‌డీఏ గ్రౌండ్‌లో స్థిరాస్తి ప్రదర్శనను నిర్వహిస్తోంది. సుమారు వంద మంది డెవలపర్లు పాల్గొనే ఈ కార్యక్రమంలో దాదాపు లక్ష మంది కొనుగోలుదారులు విచ్చేస్తారని అంచనా. దాదాపు 500 ప్రాజెక్టుల్లో యాభై వేల యూనిట్లను ఈ నాలుగు రోజుల ప్రాపర్టీ షోలో ప్రదర్శిస్తారు.
తెలంగాణ గ్రిడ్ పాలసీ కారణంగా ఉత్తర హైదరాబాద్ చక్కటి ప్రయోజనం పొందుతుంది. పశ్చిమ హైదరాబాద్ తో పోటీపడి అభివృద్ధి చెందేలా కండ్లకోయ వద్ద అతి పెద్ద ఐటీ టవర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ మొదటి దశలో వంద కంపెనీలు ఏర్పాటు చేయడం వల్ల యాభై వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ప్రాంతమే జినోమ్‌వ్యాలీకి ప్రధాన కేంద్రమని చెప్పొచ్చు. బయో మెడికల్ మరియు ఆర్‌అండ్‌డీ క్లస్టర్‌గా ప్రపంచ శ్రేణి సదుపాయాలు కలిగిన ఈ ప్రాంతం ఉత్తర కారిడార్‌లోనే ఉంది. ఈ జినోమ్ వ్యాలీలో 200కు పైగా కంపెనీలు శాస్త్రీయ పరిశోధలు చేస్తున్నాయి. 15 వేల మందికి పైగా ఇప్పటికే పని చేస్తున్నారు. నొవార్టిస్, గ్లాస్కోస్మిత్‌క్లిన్, ఫెర్రింగ్స్ మొదలైన సంస్థలు ఉన్నాయి.
హైదరాబాద్ –నాగ్ పూర్ ఇండస్ట్రీయల్ కారిడార్ (హెచ్‌ఎన్‌ఐసీ) వల్ల ఈ ఉత్తర కారిడార్ ప్రయోజనం పొందుతుంది. వేగవంతమైన మౌలిక సదుపాయాలు, పరిశ్రమ వృద్ధి కూడా సాధ్యమవుతుంది. ఈ అభివృద్ధి ఉద్యోగావకాశాలు సృష్టించడంలో తోడ్పడటం వల్ల హౌసింగ్ కోసం డిమాండ్ పెరుగుతుంది. అందుకే, మేం ఉత్తర హైదరాబాద్‌లో ప్రాపర్టీ షోకు ప్రణాళికల్ని రచించాం. దీని వల్ల ఇక్కడి ప్రజలు తమకు అందుబాటులో ఉన్న ఇళ్లను కొనుగోలు చేసే వీలు కలుగుతుంది. – వి. రాజశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, క్రెడాయ్ హైదరాబాద్.
This website uses cookies.