Categories: ReraTOP STORIES

సువ‌ర్ణ‌భూమిపై టీఎస్ రెరా రూ.25 ల‌క్ష‌ల జ‌రిమానా!

  • డీఎన్ఎస్ ఇన్‌ఫ్రాపై రూ.36.50 ల‌క్ష‌లు
  • శ్రీనివాసం డెవ‌ల‌ప‌ర్స్‌పై 3 ల‌క్ష‌లు

తెలంగాణ రాష్ట్రంలో రెరా అథారిటీ కొర‌డా ఝ‌ళిపిస్తోంది. రెరా షోకాజ్ నోటీసును బేఖాత‌రు చేసిన మూడు రియ‌ల్ సంస్థ‌ల‌పై తాజా జ‌రిమానా విధించామ‌ని ఒక ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ప‌దిహేను రోజుల్లో స‌మాధానం ఇవ్వాల‌న్న రెరా అథారిటీకి స‌మాధానాలు స‌మ‌ర్పించ‌కుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన మూడు సంస్థ‌ల‌పై క‌న్నెర్ర చేసింది. మేడ్చల్, మల్కాజిగిరి, కొంపల్లి శ్రీనివాసం డెవలపర్స్ సంస్థకు 3 లక్షలు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, కుతుబుల్లాపూర్ సుచిత్ర ప్రాంతంలోని డీఎన్ఎస్ ఇన్ఫ్రా కంపెనీకి 36.50 లక్షలు, పటాన్ చెరువు సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థకు 25 లక్షలు జ‌రిమానాను విధిస్తూ మంగళవారం రెరా’ ఆదేశాల్ని జారీ చేసింది.

రెరా నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించిన ఈ సంస్థ‌లు అడ్వ‌ర్ట‌యిజింగ్ మ‌రియు మార్కెటింగ్ కార్య‌క‌లాపాల్ని చేప‌ట్టినందుకీ జ‌రిమానాను టీఎస్ రెరా అథారిటీ విధించింది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడానికి ముందుగా ‘రెరా’లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని, రెరా’ నిబంధనలు ఉల్లంఘించే ప్రాజెక్టులపై చట్టరీత్యా తగిన‌ చర్యల్ని తీసుకుంటామ‌ని టీఎస్ రెరా ఛైర్మ‌న్ డా.ఎన్ స‌త్యనారాయ‌ణ‌ హెచ్చ‌రించారు. సొంతింటి కల సాకారం చేసుకోవాలనే కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణకు రియాల్టీ సంస్థలు జవాబుదారీతనంతో వ్యవహరించాలని అన్నారు.

This website uses cookies.