రెరా నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు షోకాజు నోటీసులకు స్పందించకుండా, ‘రెరా’ హియరింగ్ కు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి.. ‘రెరా’ రిజిస్ట్రేషన్ పొందకుండా ప్రచారంతో పాటు మార్కెటింగ్ కార్యకలాపాలకు పాల్పడిన పలు రియల్ కంపెనీలకు టీఎస్ రెరా గట్టి షాకునిచ్చింది. ఇద్దరు బిల్డర్లు, ఒక రియల్టర్‌పై సుమారు రూ.17.50 కోట్ల జరిమానాను విధించింది. వివరాల్లోకి వెళితే..
అమాయక కొనుగోలుదారుల్ని దారుణంగా మోసగించిన సాహితీ గ్రూప్‌పై టీఎస్ రెరా కొరడా ఝళిపించింది. ఈ సంస్థ రెరా అనుమతి లేకుండా పలు ప్రాజెక్టుల్లో ఫ్లాట్లను విక్రయించిన విషయం తెలిసిందే. కేశినేని డెవలపర్స్‌తో కలిసి గచ్చిబౌలిలో సాహితీ సితార కమర్షియల్ స్థలాన్ని విక్రయిస్తున్నది. దీంతో పాటు సాహితీ సంస్థ.. సాహితీ సిస్టా ఎబోడ్, శార్వాణీ ఎలైట్ లో అమ్మకాల్ని చేపట్టింది. దీంతో రెరా నోటీసులు జారీ చేసినప్పటికీ సాహితీ సంస్థ పెద్దగా స్పందించలేదు.
శార్వాణీ ఎలైట్ ప్రాజెక్టుకు సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించమని ఆదేశించినా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. నోటీసుల్ని జారీ చేసినా.. హియరింగ్‌కు హాజరు కావాలని ఆదేశించినా పట్టించుకోలేదు. దీంతో ఈ సంస్థ చేపట్టిన మొత్తం ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాల్ని సేకరించిన టీఎస్ రెరా.. రెరా నిబంధనల్ని ఉల్లంఘించి పలు ప్రాజెక్టుల్ని చేపట్టిన సాహితీ సంస్థపై రూ. 10.74 కోట్లను అపరాధ రుసుముగా విధించింది. పదిహేను రోజుల్లోపు అపరాధ రుసుము చెల్లించి.. సమాధానం సమర్పించకపోతే.. రెరా 59 (2) సెక్షన్ ప్రకారం తదుపరి చర్యల్ని తీసుకుంటామని టీఎస్ రెరా హెచ్చరించింది.
మంత్రి డెవలపర్స్ జూబ్లి హిల్స్ చెక్ పోస్టులో ప్రాజెక్టు చేపట్టడంతో ఫారం – ‘బి’ లో తప్పుడు సమాచారాన్ని పొందుపర్చడమే కాకుండా.. వార్షిక, త్రైమాసిక నివేదికలు సమర్పించని కారణంగా.. సెక్షను 60, 61 ప్రకారం.. అపరాధ రుసుము కింద 6.50 కోట్లను విధిస్తూ టీఎస్ రెరా ఆదేశించింది. అపరాధ రుసుము చెల్లించకపోతే సెక్షను 63 క్రింద తదుపరి చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
సాయి సూర్య డెవలపర్స్ సంస్థ నేచర్ కౌంటీ పేరుతో రెరా రిజిస్ట్రేషన్ లేకుండా.. ప్లాట్లను అమ్మినందుకు రెరా షోకాజ్ నోటీసును జారీ చేసింది. నిబంధనల్ని ఉల్లంఘించినందుకు రూ. 25 లక్షలు అపరాధ రుసుమును విధిస్తూ ఉతర్వుల్ని జారీ చేసింది.
టీఎస్ రెరా 59 (2) ప్రకారం.. రియల్ ఎస్టేట్ ప్రమోటర్ రెరా ఆదేశాల్ని బేఖాతరు చేస్తే సుమారు మూడేళ్ల పాటు జైలు శిక్షను విధిస్తారన్నమాట. ప్రాజెక్టు విలువలో మొత్తం పది శాతం జరిమానాను విధిస్తారు. ఈ రెండూ కలిపి విధించే అవకాశమున్నది.
This website uses cookies.