Categories: TOP STORIES

టీఎస్ రెరా ఛైర్మ‌న్‌గా డా. స‌త్య‌నారాయ‌ణ‌ నియామ‌కం.. రెరా స‌భ్యులు ఎవ‌రంటే?

ఎట్ట‌కేల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం టీఎస్ రెరా ఛైర్మ‌న్‌ను ఎంపిక చేసింది. ప్ర‌స్తుతం సీడీఎంఏగా వ్య‌వ‌హ‌రిస్తున్న డా. ఎన్‌ స‌త్య‌నారాయ‌ణ‌ను ప్ర‌ప్ర‌థ‌మ‌ టీఎస్ రెరా చైర్ ప‌ర్స‌న్‌గా నియ‌మిస్తూ సోమ‌వారం 84 జీవోను విడుద‌ల చేసింది. ఐఏఎస్ అధికారుల్లో సౌమ్యుడిగా మంచి పేరున్న ఆయ‌న నియ‌మాకం మెరుగైన నిర్ణ‌య‌మ‌ని హైద‌రాబాద్ రియ‌ల్ రంగం అంటున్న‌ది. సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ రాజేశ్వ‌ర్ తివారీ ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత రెరా ఛైర్మ‌న్‌గా సోమేష్ కుమార్ కొంత‌కాలం వ్య‌వ‌హ‌రించారు. ఆత‌ర్వాత ప్ర‌స్తుత సీఎస్ శాంతికుమారి అద‌న‌పు బాధ్య‌త‌ల్ని చేప‌ట్టారు. తాజాగా, రెరా ఛైర్మ‌న్‌గా డా.ఎన్ స‌త్య‌నారాయ‌ణ‌ను నియ‌మించ‌డంతో.. గృహ కొనుగోలుదారుల స‌మ‌స్య‌లను విన‌డానికో అధికారి ఉన్నార‌ని గృహ కొనుగోలుదారుల‌కు ధైర్యం ల‌భిస్తుంది.

రెరా అప్పీలేట్ ట్రిబ్యున‌ల్ ఎప్పుడు?
రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్, 2016లోని సెక్షన్ 43 ప్రకారం, రెరా అథారిటీ ఆమోదించిన ఉత్త‌ర్వుల చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌ను రెరా అప్పీలేట్ ట్రిబ్యున‌ల్ అథారిటీ ప‌రిశీలిస్తుంది. మ‌రి, ఆయా నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించాలా? లేదా ర‌ద్దు చేయాల‌నే అనే అంశాన్ని అప్పీలేట్ ట్రిబ్యున‌ల్ నిర్ణ‌యిస్తుంది. అయితే, ఈ ట్రిబ్యున‌ల్ నిర్ణ‌యాన్ని హై కోర్టులో అప్పీల్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. మ‌రి, ఇంత కీల‌క‌మైన రెరా అప్పీలేట్ ట్రిబ్యున‌ల్‌ను ప్ర‌భుత్వం నియ‌మిస్తే.. రెరా పూర్తి స్థాయిలో ప‌ని చేయ‌డానికి వీలుంటుంది. లేక‌పోతే, రెరా ఛైర్‌ప‌ర్స‌న్‌ను నియ‌మించ‌డం వ‌ల్ల అంతిమంగా ప్ర‌జ‌ల‌కు కానీ రియ‌ల్ సంస్థ‌ల‌కు కానీ ఒన‌గూడే ప్ర‌యోజనం ఉండ‌దు. కాబ‌ట్టి, ప్ర‌భుత్వం ట్రిబ్యున‌ల్‌నూ అత్య‌వ‌స‌రంగా ఏర్పాటు చేయాలి.

రెరా స‌భ్యులు?
జీహెచ్ఎంసీలో రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ ఆఫీస‌ర్ కె. శ్రీనివాస్ రావు, వాణిజ్య ప‌న్నుల శాఖ‌లో ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన ల‌క్ష్మీనారాయ‌ణ ల‌ను రెరా మెంబ‌ర్లుగా నియ‌మించారు.

This website uses cookies.