తెలంగాణ రాష్ట్రంలో ఇళ్ల కొనుగోలుదారులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంతో పాటు రియల్ రంగం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకై కృషి చేస్తానని డా.ఎన్ సత్యనారాయణ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ప్రప్రథమ ఛైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు సోమవారం జీవోను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయన రెజ్ న్యూస్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. కొనుగోలుదారుల ప్రయోజనాల్ని పరిరక్షించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తన మీద నమ్మకాన్ని ఉంచిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి క్రిటికల్ అండ్ కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ప్రధానంగా దృష్టి సారించారు. ఫలితంగా, అప్పటివరకూ ఉమ్మడి రాష్ట్రంలో సర్వసాధారణమైన విద్యుత్ కోతలనేవి లేకుండా చేయడంలో ఘనవిజయం సాధించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి వాటిని విజయవంతంగా చేపట్టారు. పల్లెలతో బాటు నగరాలు, పట్టణాల్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యం. అందుకు అనుగుణంగా పట్టణాల్లో వినూత్నమైన నిర్ణయాల్ని తీసుకున్నారు. ఈ క్రమంలో పురపాలక శాఖ మంత్రి ఆధ్వర్యంలో సరికొత్త మున్సిపల్ చట్టాన్ని రూపొందించుకున్నాం. పట్టణ ప్రాంతాల్ని హరితమయం చేసేందుకు మున్సిపల్ బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధుల్ని కేటాయించుకున్నాం. మున్సిపాలిటీలను అప్‌గ్రేడ్ చేసుకున్నాం. దీర్ఘకాలిక ప్రణాళికలతో తెలంగాణ పట్టణాల్లో మౌలిక సదుపాయల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాం. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. రెరా అథారిటీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాను. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. కాబట్టి, ఈ రంగాన్ని మరింత వృద్ధి చెందడానికి ప్రయత్నిస్తానని తెలిపారు.
This website uses cookies.