హైదరాబాద్లో మొదటి అర్థ సంవత్సరంలో సుమారు 37 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని వివిధ రిటైల్ బ్రాండ్లు తీసుకున్నాయని సీబీఆర్ఈ తాజా నివేదిక వెల్లడించింది. ఇందులో సుమారు 24 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని పలు షాపింగ్ మాళ్లు, ఖరీదైన వీధుల్లో స్థానిక బ్రాండ్లు తీసుకున్నాయని తెలియజేసింది. ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరగడానికి ఆస్కారం ఉందని నివేదికలో పేర్కొంది. ఫ్యాషన్ మరియు దుస్తుల బ్రాండ్లు, ఎంటర్ టైన్మెంట్, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ షోరూములు స్థలాన్ని తీసుకున్న వాటిలో ఉండటం గమనార్హం.
ఐనాక్స్ సంస్థ సుమారు యాభై వేల చదరపు అడుగుల స్థలాన్ని నెక్లెస్ ప్రైడ్ మాల్ లో తీసుకుంది. ఇందులోనే డెకథ్లాన్ ఇరవై వేల చ.అ. స్థలాన్ని తీసుకోవడం గమనార్హం. తూర్పు హైదరాబాద్లోని ఒక మల్టీప్లెక్సులో మూవీమ్యాక్స్ 25 వేల చ.అ. స్థలాన్ని తీసుకుంది. ఇవే కాకుండా కూకట్ పల్లి, మాదాపూర్లో పలు సంస్థలు స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. దీంతో నగరంలో వివిధ సంస్థలు లీజుకు తీసుకున్న స్థలం.. సుమారు 7.7 కోట్ల చదరపు అడుగులకు చేరింది. ఈ ఏడాది చివరిలోపు రిటైల్ లీజింగ్ సుమారు అరవై నుంచి అరవై ఐదు లక్షలకు చేరుకునే అవకాశముందని సీబీఆర్ఈ ఛైర్మన్ అంశుమన్ మ్యాగజీన్ అభిప్రాయపడ్డారు.
This website uses cookies.