- అద్దె ఆదాయం కోసం రెండో ఇంటి కోసం పలువురి మొగ్గు
- కమర్షియల్ ప్రాంతాల్లో కొనుగోలుకు యత్నాలు
సొంతిల్లు ఉండటం అనేది ప్రతి ఒక్కరి కల. అప్పు చేసో, ఏదైనా ప్రాపర్టీ అమ్మి అయినా సరే సొంతిల్లు కొనుక్కోవాలనే చాలామంది చూస్తారు. అయితే, ఉండటానికి సొంతిల్లు ఉన్నవారు కూడా ఇప్పుడు రెండో ఇంటి కోసం చూస్తున్నారు. స్థిరమైన అద్దె ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో మరో ఇల్లు కొనుక్కోవాలని భావిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఈ ధోరణి బాగా పెరిగింది. ముఖ్యంగా కమర్షియల్ ప్రాంతాల్లోని ఇళ్లకు భారీగా అద్దెలు వస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో రెండో ఇంటి కొనుగోలుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు.
వాస్తవానికి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ గత కొంతకాలంగా నెమ్మదిగా సాగుతోంది. గృహ రుణ వడ్డీ రేట్లు పెరగడం, ఎన్నికల సంవత్సరం కావడం, ప్రాపర్టీ ధరలు పెరగడం వంటి కారణాలతో రియల్ రంగం కాస్త నెమ్మదించింది. అయితే, ఈ పరిస్థితుల్లోనూ అద్దె ఇళ్లకు మాత్రం డిమాండ్ తగ్గలేదు. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇంటి అద్దె రూ.30 వేల నుంచి రూ.50వేల వరకు ఉంది. ప్రాంతం, సౌకర్యాలను బట్టి రూ.లక్ష, రూ.లక్షన్నర వరకు కూడా అద్దెలు ఉంటున్నాయి. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇల్లు రూ.12 వేల నుంచి రూ.20వేల వరకు అద్దెకు లభిస్తోంది. దీంతో అధిక ఆదాయం వస్తున్న హైటెక్ సిటీ వంటి కమర్షియల్ ప్రాంతాల వైపే ఎక్కువ మంది మక్కువ చూపిస్తున్నారు.
ఒకప్పుడు స్థలం కొనడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్ మెంలు, విల్లాలకు బాగా ఆదరణ ఉండటం, అద్దెలు కూడా బాగ వస్తుండటంతో స్థలం కంటే రెండో ఇల్లే బెటరని చాలామంది భావిస్తున్నారు. పైగా ఆదాయ పన్ను ప్రయోజనాలు ఉండటం, నెలనెలా స్థిర ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో రెండో ఇంటిపై పెట్టుబడికే ఎక్కువ మంది ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.