Categories: TOP STORIES

యూడీఎస్ బ్యాచ్..సీనియర్లకు స్కెచ్!

లేఅవుట్లు వేయాలన్నా.. అపార్టుమెంట్లు కట్టాలన్నా.. భూమి ఉండాల్సిందే. ఇది గజాల్లో ఉన్నా.. ఎకరాల్లో అయినా.. స్థలం తప్పక కావాల్సిందే. అయితే, ఇటీవల హైదరాబాద్ రియల్ రంగంలోకి ప్రవేశించి.. మార్కెట్ను అల్లకల్లోలం చేస్తున్న యూడీఎస్ దుష్ఠశక్తులు ఏకంగా సీనియర్ డెవలపర్లను ఇక్కట్లకు గురి చేస్తున్నారు. అదెలాగో తెలిస్తే.. మీరు షాక్ అవుతారు.

ఆయనో సీనియర్ డెవలపర్. గత ముప్పయ్యేళ్లుగా నగర నిర్మాణ రంగంలో వందలాది ఇళ్లను నిర్మించారు. పద్ధతి ప్రకారం అనుమతుల్ని తీసుకుంటూ, రెరా అనుమతితో నిర్మాణాల్ని చేపడతారనే పేరు గడించారు. ఎక్కడా పెద్దగా హడావిడి చేయకుండా.. మీడియాకు దాదాపుగా దూరంగా ఉంటూ.. ఫ్లాట్లు, విల్లాల్ని కట్టుకుంటూ పోతారు. ఆయన దగ్గర కొన్నవారూ సకాలంలో ఫ్లాట్లలోకి గృహప్రవేశం చేశారు. అప్రిసియేషన్ కూడా గణనీయంగా అందుకున్నారు. అలాంటి పెద్ద మనిషికి ప్రస్తుతం చిక్కొచ్చి పడింది. అదేంటో తెలుసా?

ఆయన నగరంలోని రెండు ప్రాంతాల్లో స్థలాల్ని చూశారు. అడ్వాన్సులు కూడా చెల్లించారు. లీగల్గా కొన్ని డాక్యుమెంట్లు అవసరం కావడంతో వాటిని ప్రభుత్వ కార్యాలయాల నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే కరోనా వల్ల కొంత ఇబ్బందులు ఎదురు కావడంతో పని ముందుకెళ్లలేదు. రెండు అడుగులు ముందుకి.. నాలుగు అడుగులు వెనక్కిలాగ పరిస్థితి మారింది. ఈలోపు యూడీఎస్ ముష్కరుల దృష్టి ఆయా భూమిపై పడింది. మధ్యవర్తి ద్వారా స్థల యజమానికి అడ్వాన్సు ఇచ్చేసి వెంటనే అందులో అపార్టుమెంట్లను కడుతున్నామని చెబుతూ బ్రోచర్లను ముద్రించి అమ్మకాలు మొదలెట్టారు. దీంతో, ఆయన ఆశ్చర్యపోయారు. అసలే ఆ భూమికి సంబంధించి న్యాయపరంగా కొన్ని పత్రాల కోసం ఆయన చూస్తుండగా.. ఈలోపు యూడీఎస్ విరాట్లు ఏకంగా ఫ్లాట్లను అమ్మకానికి పెట్టారు. దీంతో, ఆయన ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తాను ఇప్పటికే అడ్వాన్సు ఇవ్వడమే కాకుండా.. ఆయా పని కూడా మరో రెండు వారాల్లో పూర్తి అవుతుందని అనుకుంటుండగా.. ఈలోపు ముష్కరులు ఆయా స్థలయజమానికి బుట్టలో వేసుకున్నారు. అడ్వాన్సులిచ్చిన వెంటనే అమ్మకానికి పెట్టేశారు.

మరో డెవలపర్.. కొల్లూరులో ఒక స్థలం చూశాడు. అడ్వాన్సు కూడా చెల్లించాడు. భూమికి సంబంధించి కొంత క్లియరెన్స్ కావాలి. ఇంతలో కరోనా సోకింది. స్థల యజమాని ఫోను చేస్తే లిఫ్ట్ చేయలేని దుస్థితి. ఈలోపు యూడీఎస్ బిల్డర్లు ఆయా స్థల యజమానిని పట్టుకుని.. అప్పటికే ఉన్న వ్యక్తిని దూరం పెట్టించేసి.. ఆయా స్థలాన్ని సొంతం చేసుకున్నారు. నిజానికి, ఆ భూమిలో న్యాయపరమైన చిక్కులున్నాయి. వాటిని పరిష్కరించుకోవడానికి కొంత సమయం పడుతుంది. అయినా, అవేమీ పట్టించుకోకుండా.. అలా స్థలయజమానికి అడ్వాన్సు ఇచ్చేసి.. యూడీఎస్లో అమ్మకానికి పెట్టేశారు. వాట్సప్లో మెసేజ్ చూసిన మొదటి డెవలపర్ ఒక్కసారిగా కంగుతిన్నారు. స్థలయజమానిని నిలదీశారు. ఇప్పుడు అందులో కొన్నవారు ఇబ్బందులు పడాల్సిన దుస్థితి. ఎందుకంటే, అందులో కొన్నవారంతా అడ్డంగా ఇరుక్కుపోతారు. ఎందుకంటే, అసలే కొత్త డెవలపర్లు.. ఆయా లీగల్ సమస్యల్ని పరిష్కరించుకునే పరిజ్ఞానం పెద్దగా లేదు. పోనీ, ఎవరైనా అనుభవజ్ఞుల్ని సంప్రదిస్తారా? అంటే.. అదీ లేదు. మొత్తానికి, అందులో కొన్నవారు దారుణంగా ఇబ్బందిపడతారు.

మొత్తానికి, ప్రీ లాంచ్ ఆఫర్లు, యూడీఎస్ స్కీముల ద్వారా కొందరు ప్రబుద్ధులు కొనుగోళ్లదారుల్ని ఇబ్బంది పెట్టడంతో పాటుఏకంగా సీనియర్ బిల్డర్లకు భూముల్ని దొరక్కుండా చేస్తున్నారు. పోనీ, వీరేమైనా న్యాయపరంగా అన్నీ పక్కాగా క్లియర్ చేసుకుని అపార్టుమెంట్లను కడతారా? అంటే.. అదీ లేదు. స్థలయజమానికి అడ్వాన్సు చెల్లించి.. వెంటనే యూడీఎస్లో అమ్ముకోవడంలో ఉన్నంత శ్రద్ధ.. నిర్మాణాల్ని కట్టడం మీద ఉంటుందా? అంటే సందేహించాల్సిందే. మరి, ఇలాంటి వారిని ఎలా నియంత్రించాలో పరిశ్రమ పెద్దలంతా ఒకతాటి మీదికొచ్చి.. స్పష్టంగా చర్చించి.. తుది నిర్ణయానికి రావాలి. ఈ పరిస్థితిని ఇలాగే వదిలేస్తే.. ఢిల్లీ, నొయిడా తరహాలో హైదరాబాద్ నిర్మాణ రంగం దారుణంగా దెబ్బ తింటుంది. మన చెట్టును మనమే నరుక్కుని నీడ లేకుండా చేసుకున్న వాళ్లమవుతామని గుర్తుంచుకోవాలి.

(బాక్స్)

జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతి తీసుకుని.. రెరా పర్మిషన్ తీసుకుని.. ప్రీ లాంచ్లో అమ్మితే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే, అందులో కొన్నవారికి పూర్తి స్థాయిలో రెరా రక్షణ ఉంటుంది. ఫ్లాట్ అమ్మిన ఐదేళ్ల దాకా నిర్మాణపరమైన లోపాలకు ఆయా డెవలపరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. డెవలపర్లపై నమ్మకం ఉన్నవారూ వంద శాతం సొమ్ము కట్టినా ఫర్వాలేదు. ఎందుకంటే, ఎలాంటి సమస్య వచ్చినా తెలంగాణ రెరా అథారిటీ ఆదుకుంటుంది. కాబట్టి, కొనుగోలుదారులు రేటు తక్కువనే విషయం మీద మాత్రమే ఫోకస్ చేయవద్దు.

This website uses cookies.