కొంతకాలం నుంచి హైదరాబాద్‌లో సాధారణ ఫ్లాట్ల అమ్మకాలు తగ్గిపోయాయి. బయ్యర్లు కొందరు యూడీఎస్ లేదా ప్రీ లాంచ్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తవుతుందో లేదో అనే అంశాన్ని పక్కన పెట్టేసి.. ఎందుకు పలువురు బయ్యర్లు సాహసం చేస్తున్నారు? అసలు వీరు బయ్యర్లా? లేక పెట్టుబడిదారులా?
హైదరాబాద్లో రియల్ రంగం అభివృద్ధి చెందుతున్నది. భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. ఎందుకు పెరిగాయి? ఏయే అంశాల వల్ల పెరిగాయనే అంశాన్ని పక్కన పెడితే.. స్థలాల రేట్లు అధికమయ్యయనేది మాత్రం వాస్తవం. దీంతో, అప్పటివరకూ తక్కువ రేటున్న ఫ్లాట్ల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మియాపూర్‌లో రెండేళ్ల క్రితం చదరపు అడుక్కీ రూ.4000 ఉండేది. ఇప్పుడేమో ఏకంగా రూ.6000కి అటుఇటుగా పెరిగింది. మరి, ఈ రెండేళ్లలో మియాపూర్‌లో ఏమైనా అద్భుతం జరిగిందా? అంటే చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. ఇక్కడి డీమార్ట్ వెనక వైపు ఉన్న గుర్నాధం చెరువును ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చేయనే చేయలేదు. ప్రచారం కోసం అప్పుడప్పుడు పనుల్ని పరిశీలిస్తున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు హడావిడి చేయడం నిత్యకృత్యమైంది. అయినా, ఇక్కడ చదరపు అడుక్కీ రూ.6000 అయ్యింది. వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్ ధర రెండేళ్లలో ఇరవై లక్షలు పెరిగితే.. కొనుగోలుదారుల జీతాలు అంతంత పెరగాలి కదా? అందుకే, మియాపూర్ నుంచి బాచుపల్లి ప్రధాన రహదారిలో.. ఓ నిర్మాణ సంస్థ యూడీఎస్‌లో చదరపు అడుక్కీ రూ. 3500కే ఫ్లాట్లను విక్రయించింది. దాదాపు ఓ ఐదు వందల మందికి ఇలాగే ఫ్లాట్లను అమ్మేసింది. దీంతో, ఈ సంస్థను చూసి మియాపూర్, బాచుపల్లి, మల్లంపేట్, భౌరంపేట్, పటాన్‌చెరు, రుద్రారం, ముత్తంగి, భానూరు, వెలిమల, కొల్లూరు.. వంటి ప్రాంతాల్లో చిన్నచితకా బిల్డర్లంతా యూడీఎస్, ప్రీ లాంచుల్లో ఫ్లాట్లను విక్రయించడం మొదలెట్టారు.
This website uses cookies.