హైదరాబాద్‌లోని అధిక శాతం నిర్మాణ సంస్థలు ఆర్థికపరమైన కష్టాల్ని ఎదుర్కొంటున్నాయి. కొందరు బిల్డర్లు సైట్లలో ఉద్యోగులకు జీతాలివ్వని దుస్థితి. కరెంటు బిల్లులు కట్టాలంటే కష్టించాల్సి వస్తోంది. మరికొందరు ఉద్యోగుల్ని తగ్గించుకుని పనుల్ని జరిపిస్తున్నారు. దీపావళి రోజుల్లో వెలుగుజిలుగులు నిండాల్సిన పలు నిర్మాణ సంస్థలు దారుణమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. దీనికి ప్రధాన కారణం.. యూడీఎస్, ప్రీ లాంచ్ ప్రాజెక్టులే. మన నిర్మాణ రంగంలో వందల కోట్ల మేరకు యూడీఎస్, ప్రీ లాంచ్ మోసం జరుగుతున్నా.. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని నిర్మాణ సంస్థలు వాపోతున్నాయి. పేకాట ఆడి దొరికితేనే ఎంతో రాద్దాంతం చేసే అధికార యంత్రాంగం.. ఎందుకీ యూడీఎస్, ప్రీ లాంచుల మీద దృష్టి సారించడం లేదు?
కొందరు అక్రమార్కులు, ఏజెంట్లు, రియల్టర్లు కలిసి ఏం చేశారంటే.. కొందరు కొనుగోలుదారులకు యూడీఎస్, ప్రీలాంచ్ మత్తును ఎక్కించేశారు. దీంతో, వీరంతా ప్రతి ప్రాజెక్టుకు వెళ్లి యూడీఎస్, ప్రీ లాంచుల్లో ఫ్లాట్లు కొంటామని అడగటాన్ని అలవాటు చేసుకున్నారు. అనుమతులన్నీ పక్కాగా తీసుకుని కడుతున్న ప్రాజెక్టుల్లో ఈ విధానం వల్ల నష్టపోయేది బిల్డర్లే. అందుకే, వీరు ససేమిరా కుదరదని చెబుతున్నారు. దీంతో, ఎక్కడ రేటు తక్కువుంటే అటువైపు బయ్యర్లు పరుగులు పెడుతున్నారు. యూడీఎస్‌లో కొనడం కరెక్టు కాదు.. ప్రీ లాంచ్లో కొంటే మోసపోతారు.. అని ఎంత నెత్తినోరు మొత్తుకుంటున్నా.. అధిక శాతం పట్టించుకోవడం లేదు. దీంతో, సాధారణ డెవలపర్లకు అమ్మకాలు పెద్దగా జరగడం లేదు. అందుకే, పురపాలక శాఖ, రెరా అధికారులు యూడీఎస్, ప్రీలాంచ్ ప్రాజెక్టులపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకు సంబంధించి ప్రకటన ఇచ్చేసి చేతులు దులుపుకోవడం కాకుండా వీటిపై ప్రత్యేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌ను ఏర్పాటు చేయాలి. అక్రమ మార్గాల్లో ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయిస్తున్న ప్రాజెక్టుల అనుమతుల్ని నిలిపివేయాలి. ఆయా సర్వే నెంబర్ల మీద రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేయాలి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని యూడీఎస్, ప్రీ లాంచ్ ప్రాజెక్టులపై ఉక్కుపాదం మోపాలి. లేకపోతే రానున్న రోజుల్లో హైదరాబాద్ నిర్మాణ రంగం అతలాకుతలం అవుతుందని పలువురు డెవలపర్లు అంటున్నారు. ఎందుకంటే, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లను కొనడానికి కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. దీంతో, అప్పులూ పుట్టని దుస్థితి. పెరిగిన భూమి ధర, నిర్మాణ వ్యయం నేపథ్యంలో కొత్తగా అనుమతులు తీసుకుని నిర్మాణాల్ని కట్టలేని పరిస్థితి. ఒకవేళ నిర్మాణ ప్రాజెక్టులంటూ నిలిచిపోతే, వాటిని పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ఆర్థికసాయం అందజేయాల్సిన పరిస్థితి ఎదురు కావొచ్చు. కాబట్టి, ప్రభుత్వం ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకుని.. పరిష్కరించాలని అధిక శాతం డెవలపర్లు కోరుతున్నారు.
కొందరు తెలివితక్కువ బిల్డర్లు ఏం చేస్తున్నారంటే.. స్థలయజమానితో 30 అంతస్తుల అపార్టుమెంట్ కడతామని కొంత సొమ్ము అడ్వాన్సు చెల్లించి.. మిగతా సొమ్మును కట్టేందుకు ఆయా భూమిని యూడీఎస్, ప్రీలాంచుల కింద దాదాపు 40 శాతం విక్రయిస్తున్నారు. మిగతా అరవై శాతం కడితేనే కదా.. ప్రాజెక్టు పూర్తవుతుంది. మరి, అనుమతులకు అయ్యే ఫీజులు, పెరిగిన నిర్మాణ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, అసలు ఆ ప్రాజెక్టు పూర్తి చేయలేరు. అయినా, చాలామంది బిల్డర్లు.. ప్రజల నుంచి ముందుగానే సొమ్ము వసూలు చేస్తూ దారుణంగా మోసగిస్తున్నారు. మరి, ఇప్పటికైనా ప్రీ లాంచ్ లేదా యూడీఎస్‌లో ఫ్లాట్లు కొనేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కేవలం ధర గురించి చూసుకోకుండా.. ప్రాజెక్టు పూర్తవుతుందా? లేదా? అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయానికి రావాలి.
నగర ప్రజలకేం కావాలో బిల్డర్లు తెలుసుకోవడం లేదు. అందుకు అనుగుణంగా అపార్టుమెంట్లను కట్టడం లేదు. కేవలం ఫ్యాన్సీ ప్రాజెక్టుల మీదే దృష్టి పెడుతున్నారు. హారిజాంటల్‌గా కట్టిన రోజులన్నీ బిల్డర్లు అంటే మర్యాద ఉంది. ఇప్పుడు వర్టికల్ గా కట్టేందుకు కొందరు డెవలపర్లు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌లో ఒక ప్రాజెక్టు కూడా డెలివరి చేయలేనివారు నలభై, యాభై అంతస్తులు కడుతున్నారు. ఇక చిన్న చిన్న మేస్త్రీలు, రియల్టర్లు. ఏజెంట్లు సైతం ఇరవై, ముప్పయ్ అంతస్తుల అపార్టుమెంట్లకు శ్రీకారం చుట్టారు. మొత్తానికి, ఇలాంటి డెవలపర్లను దారిలోకి తేవాల్సిన బాధ్యత.. ప్రభుత్వానిదే. – ఒక డెవలపర్ అభిప్రాయం.
This website uses cookies.