నిర్మాణ సంస్థలు.. రియల్ కంపెనీలు.. నిర్మాణ సామగ్రి ఉత్పత్తి సంస్థలు.. గేటెడ్ కమ్యూనిటీలు.. ఆకాశహర్మ్యాలు.. లగ్జరీ విల్లాలు.. ఇలా ఎక్కడ చూసినా ప్రతిఒక్కరూ కొవిడ్ వ్యాక్సీన్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్లోని రెండు, మూడు నిర్మాణ సంస్థలు మినహా.. మిగతా కంపెనీలన్నీ తమ ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులకు వ్యాక్సీన్ వేయించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఏప్రిల్ మూడో వారంలో నగరంలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు గేటెడ్ కమ్యూనిటీల్లో వాక్సీన్ కేంద్రాల్ని పెట్టేందుకు ముందుకొచ్చాయి. కాకపోతే, ఆతర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాక్సీన్ ఉచితం అని ప్రకటించారు. పైగా, పోలియో వ్యాక్సీన్ తరహాలో ఇంటింటికి తిరిగి వ్యాక్సీన్ వేస్తామన్నారు. దీంతో, రెండు వారాల్నుంచి వ్యాక్సీన్ ఎప్పుడొస్తుందా? అని ఆశతో ఎదురు చూసేవారి సంఖ్య పెరిగింది.
ఎప్పుడొస్తుందో?
నరెడ్కో సభ్యులతో పాటు వారి వద్ద పని చేసే భవన నిర్మాణ కార్మికులందరికీ వ్యాక్సీన్ వేయించాలని ఏకంగా కేంద్ర గ్రుహనిర్మాణ మంత్రి స్పష్టం చేశారు. దీంతో, దేశవ్యాప్తంగా ఉన్న నరెడ్కో సభ్యులంతా కాస్త ఖర్చయినా ఫర్వాలేదనుకుని.. ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి ఉపక్రమించారు. కానీ, తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సీన్ల కొరత కారణంగా ఈ పనిని చేపట్టలేకపోతున్నామని నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు పీఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్మాణ రంగానికి తోడ్పాటును అందించాలని ఆయన కోరారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెం 40లో గల హోమ్ టౌన్ తమ సిబ్బందికి కరోనా వ్యాక్సీన్ వేయించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, కొరత కారణంగా అడుగు ముందుకు వేయలేకపోయింది. ఇలాగే, అనేక సంస్థలు హైదరాబాద్లో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి, ప్రభుత్వం ఇప్పటికైనా తమ రంగానికి కరోనా వ్యాక్సీన్ ఇప్పించే ఏర్పాట్లు చేయాలని నిర్మాణ రంగం కోరుతోంది.
యుద్ధప్రాతిపదికన వేయాలి..
ప్రైవేటు ఆస్పత్రులు ఒక్కో వ్యాక్సీన్ కోసం రూ.1250 వసూలు చేస్తున్నారు. నాలుగు వందలకొచ్చే వ్యాక్సీన్ కోసం ఇంతింత రేటు వసూలు చేయడం దారుణమని ప్రజలు అంటున్నారు. ఈ టీకా కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉంది. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాళ్లు, హోటళ్లు.. ఇలా ఎక్కడ పడితే అక్కడ యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సీన్ ను అందజేయాలని అధిక శాతం డెవలపర్లు కోరుతున్నారు. ‘‘షాపింగ్ మాళ్లుకు వచ్చేవారికి అక్కడే చిన్న క్లీనిక్ తరహాలో ఏర్పాటు చేసి వ్యాక్సీన్ అందజేయాలి. లేదా అక్కడే కార్లలో కూర్చునేవారికి అయినా అక్కడే ఇచ్చే ఏర్పాట్లు చేయాలి. వీలైతే అక్కడే డాక్టర్, నర్సును ఏర్పాటు చేస్తే మెరుగ్గా ఉంటుంద’’ని క్రెడాయ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.