Categories: TOP STORIES

గొప్ప బిల్డర్ కి కస్టమరే బ్రాండ్ అంబాసిడర్ వేణుభ‌గ‌వాన్‌, ఫౌండ‌ర్‌- బి క్ల‌బ్‌

  • సంస్థ బ్రాండ్ విలువ పెంచుకుంటే
    ప్రత్యేక మార్కెటింగ్ అవసరమే లేదు

మార్కెటింగ్ అనేది అవగాహన కలిగించడం కోసం చేసే ఒక గేమ్. ఒక వస్తువు లేదా ఇల్లు.. ఏది అమ్మాలన్నా మార్కెటింగ్ చేయాల్సిందే. తగిన ప్రచారం చేసుకోవడం ద్వారా వినియోగదారులను ఆకర్షించడం అన్నమాట. మార్కెటింగ్ లేదా సేల్స్ అనేది ఒక భాగమైతే.. చెప్పిన సమయానికి డెలివరీ చేయడం అనేది అసలు సిసలు భాగం. ఒక వస్తువును సరైన సమయంలో డెలివరీ చేయడం లేదా ఇంటిని నిర్దేశిత గడువులోగా అప్పగించడం అనే అంశాలపైనే సదరు వ్యాపారి లేదా బిల్డర్ బ్రాండ్ విలువ ఆధారపడి ఉంటుంది.

ఒక వినియోగదారుడు మరో వినియోగదారుడినే నమ్ముతాడు. మీరు ఎంతగా ప్రచారం చేసినా.. ఎన్ని ఆఫర్లు ఇచ్చినా.. అంతకుముందు వినియోగదారుని మాటలనే నమ్ముతాడు. అంటే.. సంస్థ ప్రస్తుత కస్టమర్ ప్రభావం ఆ సంస్థపై చాలానే ఉంటుందన్నమాట. ఫలానా సంస్థ చాలా నమ్మకమైనది.. చెప్పిన సమయానికి చేసి చూపిస్తుంది అని ఆ సంస్థ కస్టమర్ చెప్పే మాటలు ఎన్నొ కోట్లు పెట్టి ప్రచారం చేసుకున్నా రాని విలువను తెస్తాయనడంలో సందేహమే లేదు. మార్కెటింగ్ సంస్థలు ఎంత బాగా ప్రచారం చేసినా జరగని అమ్మకాలు.. కస్టమర్ విశ్వాసంతో చెప్పే మాటలతో జరుగుతాయి. ఆ సంస్థ చాలా నమ్మకమైనదని.. వారి టీం సమర్థవంతమైనదని.. మార్కెట్లో చాలా పేరుందని ఓ కస్టమర్ చెప్పే మాటలు.. మరో కస్టమర్ లో తప్పకుండా విశ్వాసం పెంచుతాయి. ఇలాంటి వినియోగదారులను ఎంతమందిని పొందగలిగితే ఆ సంస్థ అంత ఉన్నత స్థాయికి అతి త్వరగా చేరుకుంటుంది. ఇలా మార్కెట్లో మంచి పేరు తెచ్చుకున్న సంస్థ ప్రత్యేకించి మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు.

వేర్లు దృఢంగా ఉన్న చెట్టు పెద్ద గాలివానను కూడా తట్టుకుని నిలబడుతుంది. అదే వేర్లు లోతుగా లేని చెట్టు చిన్న పిల్లగాలికే పడిపోతుంది. వ్యక్తికైనా, వ్యవస్థకైనా వేర్లు వాటి దృఢమైన విలువలే. సాధారణ బిల్డర్ తనకు నచ్చిందే వింటాడు. చివరికి తాను అనుకున్నదే చేస్తాడు. కానీ గొప్ప బిల్డర్ నిజాలను ఆకలింపు చేసుకుంటాడు. అందుకే మార్కెట్ ను ఏలతాడు. సాధారణ బిల్డర్ డబ్బు కోసమే నిర్మాణాలు చేస్తాడు. కానీ గొప్ప బిల్డర్ ఆనందదాయకమైన కమ్యూనిటీలను నిర్మిస్తాడు. సాధారణ బిల్డర్ కి డబ్బు సంపాదనలోనే తృప్తి పొందుతాడు. గొప్ప బిల్డర్ తాను నిర్మించిన ఆనందదాయకమైన కమ్యూనిటీని చూసి సంతృప్తి చెందుతాడు. కేవలం డబ్బు సంపాదించడం కోసమే పనిచేసే సంస్థలు ఎన్నటికీ గొప్ప సంస్థలు కాలేవు. కానీ సమాజంలో నలుగురికీ ఉపయోగపడేలా మహోన్నత విలువలతో పనిచేసే సంస్థలు జనం మది నుంచి ఎప్పటికీ దూరం కావు.

This website uses cookies.