అమెరికా సహా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు దశాబ్దాలుగా చూడని ద్రవ్యోల్బణం అదుపులోకి రావడానికి సంవత్సరాలు పట్టొచ్చని ప్రపంచ బ్యాంకు అధిపతి డేవిడ్ మల్పాస్ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం సాధారణ స్థాయికి రావడానికి నెలలు లేదా రెండేళ్లు కూడా పట్టొచ్చని పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం ఉండటంతో పాటు చమురు, ఎరువులు, గోధుమ వంటి కీలక వస్తువల కోరత కారణంగా మాంద్యాన్ని నివారించడం కొన్ని దేశాలకు చాలా కష్టం అవుతుందని చెప్పారు. ఎరువుల కొరత కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని.. ఆపై పంట కొరత ఆయా చోట్ల కొన్ని సంవత్సరాల పాటు కొనసాగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆహార కొరత అనేది పేద దేశాల్లో అస్థిరతకు దారి తీస్తుందని హెచ్చరించారు. అమెరికాలో మే నెలలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 8.6 శాతానికి చేరింది. ఇది 40 ఏళ్లలో గరిష్టం. ఈ నేపథ్యంలో ధరలను సాధారణ స్థాయికి తీసుకు రావడానికి వడ్డీ రేట్లను పెంచాలని ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం తీసుకుంది. అనంతరం జూన్ 15న వడ్డీ రేట్లను 0.75 శాతం మేర పెంచింది. గత 30 ఏళ్లలో ఇంత భారీగా ఎప్పుడూ పెంచలేదు. అయితే, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో వడ్డీ రేట్ల పెంపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తుందని ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తంచేసింది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి సెంట్రల్ బ్యాంకు నియంత్రణ విధానాలను ఉపయోగించాలని మల్పాస్ సూచించారు. బ్యాంకులు మరింత రుణాలు ఇస్తే.. సరఫరా చైన్ లో ఇది ఎక్కువ డబ్బు ఉంచుతుందని పేర్కొన్నారు.