Categories: LEGAL

కేసు ప‌రిష్కారం అయ్యే దాకా విల్లాల్ని అమ్మ‌కూడ‌దు!

శాంతా శ్రీరామ్ స్ప్రింగ్ వ్యాలీ
కేసులో హైకోర్టుకు భూ యజమాని

కోర్టు మధ్యంతర ఉత్తర్వులు

మణికొండ జాగీర్ గ్రామంలో శాంతా శ్రీరామ్ స్ప్రింగ్ వ్యాలీ నిర్మాణ వ్యవహారం హైకోర్టుకు వెళ్లింది. బిల్డర్ పై భూ యజమాని కోర్టుకెళ్లారు. మణికొండ జాగీర్ గ్రామంలోని ఆరు ఎకరాల భూమిలో విల్లాలు నిర్మించి విక్రయించేందుకు స్టే వెల్ అపార్ట్ మెంట్స్ ఎల్ఎల్ పీ (డెవలపర్)తో భూ యజమానులు ఒప్పందం కుదుర్చుకున్నారు. స్టే వెల్ అపార్ట్ మెంట్స్ ఎల్ఎల్ పీకి ఎం. నర్సయ్యకు చెందిన శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అశోక్ కుమార్ తుల్ల ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఐదు ఎకరాల భూమిలో క్లబ్ హౌస్, ల్యాండ్ స్కేపింగ్, ఇతర సౌకర్యాలతో ‘శాంతా శ్రీరామ్ స్ప్రింగ్ వ్యాలీ’ పేరుతో ఓ గేటెడ్ విల్లా కమ్యూనిటీ నిర్మించాలని భూయజమానులు, డెవలపర్ మధ్య 2014లో ఒప్పందం కుదిరింది. నిర్మాణం పూర్తయిన తర్వాత మొత్తం విక్రయించే విల్లాల్లో 50 శాతం వాటా భూ యజమానికి చెందాలి. బిల్డర్ హెచ్ఎండీఏ అనుమతి పొందిన తర్వాత 30 నెలల్లోగా విల్లాల నిర్మాణం పూర్తి చేసి అప్పగించాలి. అప్పగింతకు 3 నెలల గ్రేస్ పిరియడ్ కూడా ఉంది. ఈ మేరకు 2017 నవంబర్ 6 నాటికి విల్లాలను పూర్తి చేసి అప్పగించాల్సి ఉంది.

గతేడాది ఏప్రిల్ 5న భూ యజమానులకు బిల్డర్ లీగల్ నోటీసు పంపించారు. భూ యజామనులు తమ వాటాకు సంబంధించి ఒక్కో విల్లాకు రూ.1.5 కోట్ల చొప్పున మొత్తం రూ.28.5 కోట్లు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. అలా చెల్లించని పక్షంలో విల్లాలను అప్పగించమని, అంతేకాకుండా సివిల్, క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపడతామని హెచ్చరించారని భూ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా బిల్డర్ వాటా కింద ఉన్న విల్లా పనులు మాత్రమే చేస్తూ వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం గడువు ఎప్పుడో ముగిసిపోయినా.. విల్లాలను అప్పగించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఈ మేరకు అన్ని వివరాలనూ పేర్కొంటూ శాంతా శ్రీరామ్ స్ప్రింగ్ వ్యాలీకి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వకుండా హెచ్ఎండీఏను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ పిటిషన్ పరిష్కారమయ్యే వరకు విల్లాలను విక్రయించకూడదని ఏప్రిల్ 12న ఆదేశించి.. తదుపరి విచారణను జూన్ 21కి వాయిదా వేసింది.

This website uses cookies.