బంగ్లాలు విక్రయిస్తానని చెప్పి మోసం చేసిన ఓ బిల్డర్ కు 24 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు నాగ్ పూర్ అదనపు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పు ఇచ్చింది. రేవతి అసోసియేట్ అండ్ ఇన్ ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ యజమాని సుహాస్ మోరేకు ఒక్కో కేసులో మూడేళ్ల జైలు శిక్ష చొప్పున 8 కేసుల్లో 24 ఏళ్ల శిక్ష పడింది. అయితే, శిక్షలన్నీ ఏకకాలంలో అమలు చేయాలని సూచించింది. మోరేను వైట్ కాలర్ నేరస్థుడిగా అభివర్ణించిన కమిషన్.. ఒక్కో కేసులో రూ.3.2 లక్షల చొప్పన జరిమానా చెల్లించాలని స్పష్టం చేసింది. అలాగే ప్రతి కేసులో రూ. 25వేల జరిమానా, కేసు ఖర్చుల కింది రూ.5 వేలు ఫిర్యాదుదారులకు చెల్లించాలని ఆదేశించింది. ఫిర్యాదుదారులందరికీ వడ్డీతో సహా వారి సొమ్ము వెనక్కి చెల్లిస్తే.. అతడిని జైలు నుంచి విడుదల చేయొచ్చని పేర్కొంది.
అభిజిత్ కాంబ్లే అనే వ్యక్తి 2012 జూన్ 21న హింగనలో మోరే వద్ద ఓ బంగ్లా బుక్ చేసుకున్నారు. అయితే, డబ్బులు తీసుకున్నప్పటికీ బంగ్లా అప్పగించకపోవడంతో మోరేపై కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో బంగ్లా సేల్ డీడ్ రిజిస్టర్ చేయాలని ఆయన్ను ఆదేశించింది. ఒకవేళ అది కుదరని పక్షంలో కాంబ్లే చెల్లించిన రూ.2.76 లక్షల మొత్తాన్ని 12 శాతం వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని సూచించింది. అయినప్పటికీ మోరే ఆ ఆదేశాలు పాటించలేదు.
దీంతో కాంబ్లే మరోసారి కమిషన్ ను ఆశ్రయించగా.. ఈసారి అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కానీ పోలీసులను అతడిని పట్టుకోవడంలో విఫలం కావడంతో కమిషన్ పోలీసులకూ నోటీసులిచ్చింది. దీంతో 2017లో పోలీసులు మోరేను అదుపులోకి తీసుకుని కమిషన్ ముందు హాజరు పరిచారు. కమిషన్ చెప్పినట్టే చేస్తానని అంగీకరించిన మోరే.. మళ్లీ పత్తా లేకుండా పోయాడు. కాంబ్లేను మోసం చేసినట్టుగానే పలువురిని మోసం చేయడంతో మరో ఏడుగురు కూడా కమిషన్ ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు 2020 జనవరి 21న మళ్లీ మోరేను పట్టుకుని కమిషన్ కు అప్పగించడంతో తాజాగా ఆయనకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.