వాణిజ్య సముదాయాల్లో అయితే పెట్టుబడి తక్కువ.. అద్దెలు పక్కా.. అంటూ కొన్ని సంస్థలు సోషల్ మీడియాలో అడ్డగోలుగా ప్రచారం చేస్తున్న వైనాన్ని రియల్ ఎస్టేట్ గురు ప్రప్రథమంగా వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి 2022 జులై 9న రెంటల్ స్కీమా.. నయా స్కామా.. పేరిట ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. పది లక్షలు పెడితే చాలు.. నెలకు పది వేలు లేదా ఆపై అద్దె గ్యారెంటీ.. 14 లక్షలు పెడితే 14-17 వేలు పక్కాగా అందజేస్తామంటూ కొన్ని సంస్థలు తెగ ప్రచారం చేస్తున్నాయి.
ఈ క్రమంలో కొన్ని కంపెనీలైతే మదుపరులకు అద్దెలు కూడా చెల్లించాయి. ఈ క్రమంలో నగరానికి చెందిన విపినం ఎవెన్యూస్ అనే సంస్థ నానక్‌రాంగూడలో వాణిజ్య సముదాయం పేరిట కోట్ల రూపాయల్ని వసూలు చేసింది. కొల్లూరు, ఆదిభట్ల, నార్సింగి, శంషాబాద్ వంటి ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో కోట్లను కొనుగోలుదారుల్నుంచి దండుకుంది. ఏళ్లు గడుస్తున్నా ఆయా ప్రాజెక్టు నిర్మాణాల్ని ఆరంభించకపోవడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో అయితే కనీసం అనుమతుల్ని కూడా మంజూరు చేయకపోవడం గమనార్హం. నానక్‌రాంగూడలో 104/ పి సర్వే నెంబరులో సొమ్ము కట్టినవారికి 23 చదరపు గజాల స్థలాన్ని కూడా రిజిస్టర్ చేసినట్లు సమాచారం. సుమారు ఐదు ఎకరాల్లో 10 లక్షల చదరపు అడుగుల వాణిజ్య సముదాయాన్ని సంస్థ కడతామంటూ కొనుగోలుదారుల నుంచి కోట్ల రూపాయల్ని దండుకుందని సమాచారం.
This website uses cookies.