ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వచ్చి రాజధాని అమరావతిపై దృష్టి సారించడంతో అక్కడ రియల్టీ ధరలు జోరుగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న అమరావతికి ఊపొచ్చింది. అయితే, అదే సమయంలో దక్షిణాదిన రియల్ ఎస్టేట్ త్వరితగతిన వృద్ధి చెందేందుకు అవకాశం ఉన్న పట్ణణాల్లో రెండు ఏపీ నగరాలకు చోటు దక్కింది. విశాఖపట్నం, తిరుపతిల్లో రియల్ పరుగుల పెడుతుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది.
ఆధ్యాత్మిక పర్యాటకపరంగా వృద్ధి చెందే పట్టణాల్లో తిరుపతి, వారణాసి, షిర్డి, పూరి, అయోధ్య, అమృత్ సర్, ద్వారక ఉన్నాయని పేర్కొంది. మొత్తం 100కు పైగా పట్టణాల్లో సమీప భవిష్యత్తులో రియ్ ఎస్టేట్ కు మెరుగైన అవకాశాలు ఉన్న 30 పట్టణాలను నివేదిక వివరించింది. వీటిలో 17 పట్టణాల్లో వేగవంతమైన వృద్ధికి అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ జాబితాలో విశాఖ, తిరుపతితోపాటు కోచి, కొయంబత్తూర్, అమృత్ సర్, అయోధ్య, జైపూర్, కాన్పూర్, లక్నో, వారణాసి, పట్నా, పూరి, ద్వారక, నాగ్ పూర్, షిర్డీ, సూరత్, ఇండోర్ ఉన్నాయి. ఇవన్నీ చాలా తక్కువ కాలంలోనే అధిక ప్రభావం చూపించే రియల్ ఎస్టేట్ స్పాట్లుగా మారతాయని పేర్కొంది.
ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతుతోపాటు మౌలిక వసతుల అభివృద్ధి, ఆధ్యాత్మిక పర్యాటకం వంటి అంశాలు వీటి వృద్ధిలో కీలకంగా ఉంటాయని విశ్లేషించింది. మౌలిక వసతులు మెరుగుపడటం, అందుబాటు ధరలో ఇళ్లు, నైపుణ్యం కలిగిన మావన వనరులు వంటి అంశాలు చిన్న పట్టణాలు కూడా దేశ జీడీపీలో కీలకపాత్ర పోషిస్తున్నాయని కొలియర్స్ ఇండియా సీఈఓ బాదల్ యగ్నిక్ పేర్కొన్నారు. 2030 నాటికి భారత జీడీపీలో రియల్ రంగ వాటా లక్ష కోట్ల డాలర్లకు, 2050 నాటికి 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా వేశారు.
ఏపీలో వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా చేస్తామని ప్రకటించింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన అక్కడ నుంచే కొనసాగుతుందని పేర్కొంది. దీంతో అమరావతిలో రియల్ బూమ్ తగ్గి.. విశాఖలో పెరిగింది. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఓటమి చవిచూసి తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో విశాఖ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏమవుతుందా అని కొందరు ఆందోళన చెందారు. అయితే, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ..
ఏపీకి రాజధాని అమరావతే అయినప్పటికీ, విశాఖను రాష్ట్ర ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో రియల్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. విశాఖపట్నం రియల్ ఎస్టేట్ కు ఢోకా లేదని.. ఈ నగర అభివృద్ధికి సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారని క్రెడాయ్ విశాఖపట్నం చాప్టర్ చైర్మన్ కేఎస్ఆర్కే రాజు (సాయి) పేర్కొన్నారు.
This website uses cookies.