Categories: TOP STORIES

అహ్మదాబాద్ లో ఇళ్లు అ‘ధర‘హో

ఐదేళ్లలో 45 శాతం మేర పెరిగిన ఇళ్ల ధరలు

ప్రాప్ టైగర్ నివేదిక వెల్లడి

గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ రియల్ రంగం దూసుకెళ్తోంది. అక్కడ ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. గత ఐదేళ్లలో అహ్మదాబాద్ లో ఇళ్ల ధరలు ఏకంగా 45 శాతం మేర పెరగడం గమనార్హం. 2019 జనవరి-మార్చి కాలంతో చదరపు అడుగుకు రూ.2,867 ఉండగా.. ఈ ఏడాది జనవరి-మార్చి నాటికి అది రూ.4,150కి పెరిగింది. అదే గతేడాది సగటు ధరతో పోలిస్తే.. 10 శాతం పెరుగుదల నమోదైందని ప్రాప్ టైగర్ డాట్ కామ్ తన తాజా నివేదికలో వెల్లడించింది.

భారతదేశంలోని ప్రధాన రియల్ ఎస్టేట్ మార్కెట్లలో అహ్మదాబాద్ ఒకటిగా మారిందని ప్రాప్ టైగర్ డాట్ కామ్ బిజినెస్ హెడ్ వికాస్ వాధావన్ పేర్కొన్నారు. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న అహ్మదాబాద్ లో మౌలిక వసతులు బాగా అభివృద్ధి చెందడం, ముంబైతో సహా దేశంలోని పలు ప్రధాన నగరాలకు అంతరాయం లేని కనెక్టివిటీ కలిగి ఉన్న నేపథ్యంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని వెల్లడించారు. బలమైన ఆర్థిక వాతావరణంతోపాటు అధిక భద్రతా ప్రమాణాలు అహ్మదాబాద్ ను ప్రముఖ హౌసింగ్ మార్కెట్ గా నిలుపుతున్నాయని వివరించారు. గతేడాది జనవరి-మార్చి కాలంతో పోలిస్తే.. ఈ ఏడాది జనవరి-మార్చి కాలంలో అహ్మదాబాద్ లో ఇళ్ల విక్రయాలు 78 శాతం మేర పెరిగి 12,915 యూనిట్లకు చేరుకున్నట్టు ప్రాప్ టైగర్ నివేదిక తెలిపింది.

ఇక కొత్త ఇళ్ల సరఫరా మాత్రం 64 శాతం తగ్గి 3,116 యూనిట్లకు తగ్గింది. ముఖ్యంగా కోవిడ్ తర్వా అహ్మదాబాద్ రియల్ రంగం బాగా ఊపందుకుంది. 2019లో 25,734 యూనిట్లు, 2020లో 12,156 యూనిట్లు, 2021లో 16,874 యూనిట్లు, 2022లో 27,314 యూనిట్లతో పోలిస్తే గతేడాది 41,327 ఇళ్లు అమ్ముడయ్యాయి. అలాగే కొత్త సరఫరా 2019లో 15,648 యూనిట్లు ఉండగా.. 2020లో కేవలం 7,897 యూనిట్లు మాత్రమే లాంచ్ అయ్యాయి. 2021లో 41,357 యూనిట్లు, 2022లో 32,663 యూనిట్లు ఉండగా.. గతేడాది 55,877 యూనిట్లు లాంచ్ అయ్యాయి. గతేడాది చివరి త్రైమాసికంలో హౌసింగ్ విభాగంలో చదరపు అడుగు ధర సగటున రూ.4వేలు ఉండగా.. 2022లో అది రూ.3,700గా ఉంది.

This website uses cookies.